రైల్వే ఉద్యోగానికి వినేశ్ బై.. బై.. దీదీపై దాద్రిలో పోటీ
ఒలింపిక్స్ లో ఇటీవల త్రుటిలో పతకం చేజార్చుకున్న వినేశ్ ఫొగట్ మరీ ముఖ్యంగా హరియాణ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.
By: Tupaki Desk | 6 Sep 2024 1:30 PM GMTమహా భారత యుద్ధానికి కేంద్రమైన కురక్షేత్రం ఉన్న హరియాణాలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నిలు రణరంగాన్ని తలపించేలా ఉన్నాయి. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ మూడోసారీ పవర్ లోకి రావాలని చూస్తోంది. అయితే, కాంగ్రెస్ కూడా దీటుగా నిలుస్తూ సవాల్ విసురుతోంది. వీరి మధ్యలో రెజ్లర్లు రంగంలోకి దిగారు. ఒలింపిక్స్ లో ఇటీవల త్రుటిలో పతకం చేజార్చుకున్న వినేశ్ ఫొగట్ మరీ ముఖ్యంగా హరియాణ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.
వినేశ్ నేరుగా రంగంలోకి
పారిస్ ఒలింపిక్స్ లో తీవ్ర ఆవేదనాభరిత రీతిలో పతకం చేజార్చుకున్న వినేశ్.. ఇప్పుడు ఎన్నికల రింగ్ లోకి దిగారు. స్పోర్ట్స్ కోటాలో పొందిన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు మరో రెజ్లర్, రైల్వే ఉద్యోగి అయిన బజరంగ్ పునియా కూడా కాంగ్రెస్ లోనే చేరారు. ముందుగా ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి వీరు.. తర్వాత అధ్యక్షుడు ఖర్గేను కలిశారు. కాగా, వీరిద్దరూ రెండు రోజుల కిందట కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసిన సంగతి తెలిసిందే. అప్పటికే వీరు కాంగ్రెస్ లో చేరడం ఖాయమని కథనాలు రాగా.. అవే నిజమయ్యాయి.
నేడో, రేపో జాబితా..
హరియాణలో బీజేపీ ఇప్పటికే 60 మందిపైగా అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ కూడా రేపోమాపో విడుదల చేయనుంది. అందులోనే వినేశ్, బజరంగ్ లకు టికెట్లు దక్కొచ్చు. అయితే, 2019 ఎన్నికలకు ముందు వినేశ్ అక్క బబిత ఫొగట్ బీజేపీలో చేరారు. దాద్రి నుంచి పోటీకి దిగి ఓడిపోయారు. ఈసారి కూడా ఆమెకు బీజేపీ దాద్రి టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అక్కడినుంచే వినేశ్ ఫొగట్ నూ దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అంటే.. దీదీ (అక్క)పై దాద్రిలో వినేశ్ పోటీ చేస్తున్నట్లు. హరియాణాలో అక్టోబరు 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెల్లడవుతాయి.