వినేశ్ అప్పీల్ ను రిజెక్టు చేసిన కాస్.. తీవ్ర నిరాశ
వంద గ్రాముల బరువును పరిగణలోకి తీసుకుంటారా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.
By: Tupaki Desk | 15 Aug 2024 4:30 AM GMTమిణుకుమిణుకుమంటున్న ఆశలు ఆడియాశలయ్యాయి. న్యాయం కోసం చేస్తున్న పోరులో అద్భుతాలు జరిగే అవకాశాలు చాలా అరుదన్న వాదనకు తగ్గట్లే తాజా ఫలితం వెలువడింది. మనమ్మాయి కం రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు అంతర్జాతీయ క్రీడా కోర్టులో నిరాశే ఎదురైంది. ఎక్కడో ఏదో మూల ఉన్న పతక ఆశలు తాజాగా వెలువడిన నిర్ణయంతో కరిగిపోయాయి. పారిస్ ఒలింపిక్స్ లో వంద గ్రాముల బరువు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆమెపై అనర్హత వేటు వేయటం తెలిసిందే. ఆమెకు అన్యాయం జరిగిందంటూ వినేశ్ ఫొగెట్ తో పాటు, పలువురు ప్రముఖులు మాత్రమే కాదు ఆమెను అభిమానించే వారు.. ప్రజలు గట్టిగా వాదిస్తున్నారు. వంద గ్రాముల బరువును పరిగణలోకి తీసుకుంటారా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.
ఫైనల్ కు చేరిన తర్వాత అనర్హత వేటు వేయటాన్ని తప్పు పడుతూ కోర్టును ఆశ్రయించింది. సాధారణంగా ఇలాంటి అప్పీలును 24 గంటల్లో తేల్చేస్తారు. కానీ.. అందుకు భిన్నంగా వినేశ్ విషయంలో మాత్రం అసాధారణ స్థాయిలో ఎక్కువ సమయమే తీసుకున్నారు. తాజాగా తీర్పును వెలువరించారు. ఆమె అప్పీలును తిరస్కరిస్తూ నిర్ణయాన్ని ప్రకటించినట్లు భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది.
దీనికి సంబంధించి ఈ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ఒక ప్రకటన చేస్తూ.. ‘‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ విధించిన అనర్హతను సవాలు చేస్తూ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేసిన అప్పీలును కాస్ తిరస్కరించటం దిగ్భ్రాంతికి.. నిరాశకు గురి చేసింది. రజత పతకం ఇవ్వాలన్న వినేశ్ అభ్యర్థనను తోసిపుచ్చారు. కాస్ ఆగస్టు 14న తన తీర్పును ఇచ్చింది’’ అని పేర్కొన్నారు.
50 కేజీల విభాగంలో ఫైనల్లో ఓడిన క్యూబా క్రీడాకారిణి లోపేజ్ తో కలిసి తనకు రజతం ఇవ్వాలని వినేశ్ కోరింది. అయితే.. ఈ క్రీడలో మిల్లీ సెకను అంశాల్ని సైతం విజేతను ప్రకటించే అంశాల విషయంలో పరిగణలోకి తీసుకున్నప్పుడు.. నిర్ణీత బరువుకు మించి వంద గ్రాముల బరువును చిన్న అంశంగా తీసుకోరన్న వాదనకు తగ్గట్లే కాస్ తన నిర్ణయాన్ని వెల్లడించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.