Begin typing your search above and press return to search.

మోస్ట్ వేస్టెడ్ టాలెంట్..పింఛనుతో బతుకుతున్న ఇండియన్ క్రికెట్ స్టార్

సచిన్ ప్రపంచ క్రికెట్ లో ఏం సాధించాడో అందరికీ తెలిసిందే. మరి కాంబ్లీ..?? కెరీర్ ప్రారంభంలో సచిన్ కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కాంబ్లీ అంతే వేగంగా పతనం అయ్యాడు.

By:  Tupaki Desk   |   13 Dec 2024 1:30 PM GMT
మోస్ట్ వేస్టెడ్ టాలెంట్..పింఛనుతో బతుకుతున్న ఇండియన్ క్రికెట్ స్టార్
X

సరిగ్గా 35 ఏళ్ల కిందట భారత క్రికెట్ లో అతడు ఓ సంచలనం..

సరిగ్గా 30 ఏళ్ల కిందట ప్రపంచ క్రికెట్ లో పెను తుఫాను..

కానీ, కొన్నేళ్లలోనే కథ మారిపోయింది. అతడితో పాటే కెరీర్ మొదలుపెట్టిన స్నేహితుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. ప్రపంచ క్రికెట్ లో దేవుడిగా ఎదిగిపోయాడు. ఇతడా మాత్ర పాతాళంలోకి పడిపోయాడు.

ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. 1988లో ముంబై స్కూల్ క్రికెట్ లో దుమ్మురేపిన సచిన్ టెండూల్కర్- వినోద కాంబ్లీ జోడీ గురించి.

సచిన్ ప్రపంచ క్రికెట్ లో ఏం సాధించాడో అందరికీ తెలిసిందే. మరి కాంబ్లీ..?? కెరీర్ ప్రారంభంలో సచిన్ కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కాంబ్లీ అంతే వేగంగా పతనం అయ్యాడు. టీమ్ ఇండియాలో ఒక్కసారి వెనుకబడితేనే తిరిగి రావడం కష్టం.. అలాంటిది 9 సార్లు టీమ్ ఇండియాలోకి కమ్ బ్యాక్ చేశాడు. ఇందులో కొన్నిసార్లయినా సచిన్ సాయం ఉందనే చెప్పాలి. కానీ, దేనినీ అతడు నిలుపుకోలేదు.

వ్యసనాలకు బానిసై..

వర్థమాన క్రికెటర్లకు ఇప్పుడు వినోద్ కాంబ్లీ జీవితం ఓ గుణపాఠం. వ్యక్తిగా ఎంతో ఎత్తుకు ఎదగాల్సినవాడు వ్యసనాలు, క్రమశిక్షణ లోపంతో ఆరోగ్యాన్ని, జీవితాన్నే కోల్పోయాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు.

చిన్ననాటి గురువు స్మరణలో..

సచిన్, కాంబ్లీలకు చిన్ననాటి గురువు దివంగత రమాకాంత్‌ ఆచ్రేకర్. ఆయన స్మారక కార్యక్రమం ఇటీవల జరగ్గా సచిన్, కాంబ్లీ పాల్గొన్నారు. కానీ, నిల్చునేందుకూ ఇబ్బందిపడ్డాడు. ఈ నేపథ్యంలోనే అతడికి సాయం చేసేందుకు 1983 వన్డే ప్రపంచకప్‌ విజేత జట్టు సిద్ధంగా ఉందని దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్ ప్రకటించాడు. కాంబ్లీ పునరావాస కేంద్రంకు (రిహాబిలిటేషన్‌ సెంటర్‌)కు వెళ్తేనే ఈ సాయం చేస్తామని షరతు విధించాడు. దీనికి కాంబ్లీ అంగీకరించాడు.

రూ.30 వేల పింఛనుతో..

కాంబ్లీ ఆరోగ్య పరిస్థితే కాదు.. ఆర్థిక పరిస్థితీ అసలేం బాగోలేదు. మాజీ ఆటగాళ్లకు బీసీసీఐ ఇచ్చే రూ.30 వేల నెల పింఛను మీదనే అతడు ఆధారపడి బతుకుతున్నాడు. అయితే, కాంబ్లీకి భార్య, కుటుంబం మద్దతు బాగుంది. అతడి భార్య పలు ఆస్పత్రుల్లో చూపించి మెరుగైన వైద్యం అందేలా చేస్తోంది. కుమారుడు క్రిస్టియానో కూడా అండగా నిలుస్తున్నాడు. కాంబ్లీతో కలిసి ఆడిన మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఇటీవల పరామర్శించాడు. కాగా, పునరావాస కేంద్రానికి వెళ్తేనే ఆదుకునేందుకు సిద్ధం అని కపిల్ దేవ్ పెట్టిన షరతుకు కాంబ్లీ అంగీకరించాడు. దీంతో అతడు మళ్లీ మామూలు మనిషి అవుతాడని భావిస్తున్నారు.

సచిన్ తప్పేమీ లేదు.. నాదే తప్పు

కాంబ్లీ కోసం సచిన్ చాలా చేశాడు. కానీ, 2009లో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే, తాను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే అలా జరిగిందని కాంబ్లీ చెప్పాడు. 2013లో తనకు రెండు సర్జరీలు జరగ్గా మొత్తం బిల్లులు సచినే చెల్లించాడు. ఓ దశలో సచిన్‌ తన కోసం ఏమీ చేయలేదని తప్పుపట్టానని.. కానీ, అతడు ప్రతిదీ చేశాడని వివరించాడు. క్రికెట్ కెరీర్, వ్యక్తిగతంగానూ సచిన్ చేసిన మేలును గుర్తుచేసుకుని కాంబ్లీ కన్నీటి పర్యంతం అయ్యాడు.