మరింత వేడెక్కిన 'వినుకొండ'.. తాజాగా ఏం జరుగుతోందంటే!
మరి ఇక్కడ యువగళం ప్రశాంతంగా సాగుతుందో.. లేక వివాదం గా మారుతుందో చూడాలి.
By: Tupaki Desk | 31 July 2023 12:18 PM GMTఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్నవినుకొండ నియోజకవర్గం రెండు మూడు రోజుల కిందట హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ జిల్లా ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు మధ్య తలెత్తిన వివాదం రణరంగాన్ని సృష్టించింది.
ఈ క్రమంలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ సాంబశివరావు.. ఏకంగా .. టీడీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తూ.. గాలిలోకి కాల్పులు జరపడం.. ఈ క్రమంలో వైసీపీ వర్సెస్ టీడీపీ నాయకుల మధ్య చెలరేగిన ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తతలకుదారి తీసింది. ఇంకా.. ఈ గాయం నుంచి ఇరు పక్షాలు కూడా కోలుకోలేదు.
అయితే.. ఇప్పుడు వినుకొండ మరింత వేడెక్కింది. దీనికి కారణం.. టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. చేస్తున్న యువగళం పాదయాత్ర.. ఈ నియోజకవర్గంలోకి సోమవారం రాత్రికి లేదా.. మంగళవారం ఉదయానికి అడుగు పెడుతుండడమే. దీంతో టీడీపీ నాయకులు ఈ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు.
అయితే.. ఇప్పటికే టీడీపీపై కసితో ఉన్న వైసీపీ నాయకులు పాదయాత్రను భగ్నం చేసేందుకు ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు కూడా చెబుతు్న్నారు.
షెడ్యూల్ ప్రకారం సోమవారం రాత్రికే పల్నాడు ప్రాంతంలోకి పాదయాత్ర చేరుకుంటుంది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు, వేలాది మందితో కలిసి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు.
పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 7 నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సమస్యలపైనా.. ఎమ్మెల్యేల తీరుపైనా ఇప్పటికే నాయకులకు నోట్ తయారు చేసుకున్నారు.
యువగళంలో ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శిస్తున్న నారా లోకేష్.. ఇక్కడ కూడా బొల్లా సహా నంబూరి శంకర్రావు(పెదకూరపాడు ఎమ్మెల్యే) అనేక మంది నాయకుల విషయాన్ని ప్రస్తావించనున్నారు. దీంతో వినుకొండ మరింత వేడెక్కనుందని అంటున్నారు టీడీపీ నాయకులు.
ఈ క్రమంలో పోలీసులు కూడా ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని మోహరించేందుకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. మరి ఇక్కడ యువగళం ప్రశాంతంగా సాగుతుందో.. లేక వివాదం గా మారుతుందో చూడాలి.