వైసీపీ సభలో కడుపు చించుకున్న డొక్కా...!
సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ 2019 ఎన్నికల తరువాత వైసీపీ వైపు వచ్చారు.
By: Tupaki Desk | 30 Dec 2023 5:33 PM GMTవైసీపీలో సీనియర్ నేతగా ఎమ్మెల్సీగా ఉన్నారు డొక్కా మాణిక్య వరప్రసాదరావు. ఆయన మాజీ మంత్రి కూడా. కాంగ్రెస్ టైం లో పనిచేశారు. వైఎస్సార్ ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించారు. సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ 2019 ఎన్నికల తరువాత వైసీపీ వైపు వచ్చారు. ఆయన కాంగ్రెస్ టీడీపీల నుంచి వైసీపీ గూటికి చేరారు.
ఆయన ఇపుడు కడుపు చించుకున్నారు. తన ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా వైసీపీ సభలోనే. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన వైసీపీ సాధికార సభలో డొక్కా మాట్లాడుతూ తనను ఇంచార్జి బాధ్యతల నుంచి అర్ధాంతరంగా తొలగించారు అని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు ఏ విషయమూ కూడా చెప్పడంలేదు అని కూడా ఆయన అంటున్నారు. వైసీపీలో ఏమి జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబితేనే జరుగుతుంది అని ఆయన అన్నారు. ఈ సంగతి అందరికీ తెలుసు అని కూడా అన్నారు. మరి తనను ఎందుకు తొలగించారు అన్నది కూడా తెలియకపోవడం బాధాకరం అన్నారు. ఈ విషయం మీద తాను జగన్ ని కలిసి మాట్లాడాలి అనుకుంటున్నాను అని అన్నారు.
తనకు సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇప్పించాలని ఆయన సభా వేదిక మీద నుంచే కోరడం మాత్రం సంచలనం అయింది. ఎవరైనా పార్టీలో జగన్ నిర్ణయాన్ని ఆమోదించి తీరాల్సిందే. ఇందులో రెండవ మాటకు అసలు తావు లేదు అని కూడా డొక్కా అంటూనే తన బాధను వ్యక్తం చేయడం విశేషం. అందువల్ల ఒకే ఒక్క సారి జగన్ని కలిసే అవకాశం కల్పించాలని ఆ సీనియర్ నేత సభ నుంచే కోరుకోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఈ మధ్యనే పదకొండు మంది ఇంచార్జిలను వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది. అందులో పత్తిపాడు కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితను తాడికొండకు షిఫ్ట్ చేసారు. ఆమెకు అక్కడ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమె సీటును వేరొకరికి ఇచ్చారు.
అలా అటూ ఇటూ భర్తీ చేయడం జరిగింది. దాంతో ఇక ఖాళీలు అంటూ ఏవీ లేవు. మరి మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీగా ఉన్నారు. తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత ఇంచార్జిగా డొక్కాను నియమించారు. ఆయన ఆరేడు నెలలుగా అక్కడ బాధ్యతలు చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది. కానీ సడెన్ గా చేసిన మార్పులలో డొక్కా సీటు పోయింది.
సరే సీటు విషయం కూడా డొక్కా అడగడం లేదు. తనను ఎందుకు తొలగించారో చెప్పమని అంటున్నారు. అందుకే జగన్ తోనే మాట్లాడుతాను అని అంటున్నారు. మరి ఆయనకు ఎటూ టికెట్ దక్కే చాన్స్ లేదు. అపాయింట్మెంట్ అయినా జగన్ తో దొరుకుతుందా అన్నదే పాయింట్. ఏది ఏమైనా సొంత పార్టీ వేదిక మీదనే సీనియర్ నేత ఇలా ఆవేదన వ్యక్తం చేయడం మాత్రం విడ్డూరంగానే ఉంది అని అంటున్నారు.