మూడు కోతుల కథ ఎవరిదీ ఎత్తుగడ?
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వారి కుటుంబంలో మహిళలు, హోంమంత్రి అనితతోపాటు ఇతర మహిళా నాయకులపై నీచాతినీచంగా పోస్టులు పెట్టేవారు.
By: Tupaki Desk | 29 Dec 2024 5:32 AM GMTమూడు కోతుల బొమ్మ చూడగానే అందరికీ గుర్తుకువచ్చే నీతి సూత్రం చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు.. జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన ఈ నీతి కథలకు ప్రేరణగా నిలిచిన మూడు కోతుల బొమ్మలు ఇప్పటికీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. ఎక్కడైనా మూడు కోతుల బొమ్మ కనిపించిందంటే ఆ బొమ్మకింద ఏం రాశారని ఆసక్తిగా చూస్తుంటారు. అలా అందరి దృష్టిని ఆకర్షించిన మూడు కోతుల బొమ్మ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాను మంచి కోసం వాడుకుందాం అంటూ ఏపీలో గుర్తు తెలియని వ్యక్తులు చేపట్టిన క్యాంపెయిన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అమరావతితోపాటు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో మూడు కోతుల బొమ్మలతో దర్శనమిస్తున్న బ్యానర్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అంతేకాకుండా ఆ బ్యానర్లపై రాసిన కొటేషన్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. చెడు విషయాలను పోస్టు చేయొద్దు.. నైతికంగా పతనం కావొద్దంటూ మూడు కోతుల ఫొటోలతోపాటు రాసిస కొటేషన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అసత్య ప్రచారాలకు, దూషణలకు చెక్ పెడదామని, సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం అంటూ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ద్వారా చైతన్యం తెచ్చేందుకు చర్యలు చేపట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ప్లెక్సీలు, హోర్డింగులపై ఎవరు ముద్రించినది లేకపోవడంతో ఎవరు పెట్టారో అని అంతా ఆరా తీస్తున్నారు.
ఇటీవల ఏపీలో సోషల్ మీడియా పోస్టింగులపై పెద్ద దుమారమే నడిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వారి కుటుంబంలో మహిళలు, హోంమంత్రి అనితతోపాటు ఇతర మహిళా నాయకులపై నీచాతినీచంగా పోస్టులు పెట్టేవారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కుమార్తెలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఆయన రగిలిపోయారు. ప్రతిపక్షంలో ఉండగా, ఇలాంటి పోస్టింగులపై నిస్సహాయత వ్యక్తం చేసిన పవన్, అధికారంలోనూ అవే తరహా వేధింపులను సహించలేకపోయారు. దీంతో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ ప్రభుత్వంపైనా, పోలీసులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలానే ఉంటే తాను హోంమంత్రి పదవి తీసుకోవాల్సివస్తుందని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అసభ్యకర పోస్టింగులు పెట్టిన వారిని ఉక్కుపాదంతో ప్రభుత్వం అణచివేసింది. ప్రభుత్వ చర్యలకు అన్నివర్గాల వారి మద్దతు లభించడంతో ఇకపై ఇలాంటి పెడధోరణులు కొనసాగకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి. సోషల్ మీడియాను నియంత్రించే వ్యవస్థ ఏదీ లేకపోవడంతో ఎవరికి వారే నియంత్రణ పాటించాలని సూచిస్తూ ఏపీలో వెలిసిన బోర్డులు ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియా పోస్టింగులపై పౌరుల్లో బాధ్యత పెరిగేలా ఇప్పుడు సరికొత్తగా జరుగుతున్న ప్రచారం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో అనైతిక పోస్టింగుకు వ్యతిరేకంగా పెట్టిన బ్యానర్లు, హోర్డింగులకు అదే సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఎవరు పెట్టారో కానీ, వినూత్నంగా సోషల్ మీడియాను మంచి కోసం వాడుకుందామనే ప్రచారానికి డిజిటల్ ప్లాట్ ఫాం వాడకుండా పాత పద్ధతిలో హోర్డింగులు, బ్యానర్లు పెట్టడం, సింబాలిక్గా కోతుల ఫొటోలను వాడటం చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇన్నాళ్లు ఒక నీతి రీతి లేని పోస్టింగులపై ఎక్కువ ప్రచారం జరిగేది. ప్రభుత్వ నినాదాలు, కోతుల బొమ్మలు ఆలోచించేలా ఉండటంతో రెండు రోజులుగా ఈ ఫొటోల చాలా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఎవరి వ్యూహమో కానీ, అనుకున్నదానికన్నా రెట్టింపు ప్రచారం రావడం విశేషంగా చెబుతున్నారు.