Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో... రైజ్ ఆఫ్ నారా లోకేష్!

కట్ చేస్తే... ఒక్క దెబ్బతో ఉవ్వెత్తున లేచిన కెరటంలా మారిపోయారు లోకేష్.

By:  Tupaki Desk   |   10 Jun 2024 2:30 PM GMT
వైరల్  వీడియో... రైజ్  ఆఫ్  నారా లోకేష్!
X

నారా లోకేష్... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ పేరు ఒక వైరల్ విత్ వైబ్రేషన్స్! ఒకప్పుడు పండిత పుత్రః... అన్న స్థాయిలో కామెంట్లను ఎదుర్కొన్న వ్యక్తి! ఎమ్మెల్యేగా కాదు వార్డు మెంబర్ గా కూడా గెలవలేని అసమర్థుడు అనే కామెంట్లను భరించిన వ్యక్తి! 2014 - 19 మధ్య మంత్రిగా పనిచేసినా నాయకత్వ లక్షణాలు రాలేదనే విమర్శలను తట్టుకున్న వ్యక్తి!

తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేసినా, తాను మంత్రిగా పనిచేసినా మంగళగిరిలో వైఎస్ జగన్ నిలబెట్టిన ఒక అభ్యర్థిపై ఓడిపోయిన దద్దమ్మ అనే మాటలను ఓర్చుకున్న వ్యక్తి! చట్టసభల్లోనూ "పప్పు" అని పిలుస్తున్నా ఓర్పు సహనంతో సహించిన వ్యక్తి! 2019 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో 5,337 ఓట్లతో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి!

ఇదే సమయంలో అసెంబ్లీలోనూ, బయటా, ప్రధానంగా నెట్టింట ఎన్నో ట్రోలింగ్స్ ఎదుర్కొన్న వ్యక్తి! అసలు రాజకీయాలకే పనికి రాడు.. చంద్రబాబు రాజకీయాలతో అసలు పోల్చదగ్గ వ్యక్తి కాదు.. తండ్రికి తగ్గ వారసుడు కాదు..! చంద్రబాబు తదనంతరం పార్టీని నడపగలిగే ప్రశ్నేలేదు.. అది జరిగేపని కాదు.. పరిపక్వత లేని మనిషి.. ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి నారా లోకేష్!

కట్ చేస్తే... ఒక్క దెబ్బతో ఉవ్వెత్తున లేచిన కెరటంలా మారిపోయారు లోకేష్. ప్రధానంగా... "యువగళం" పాదయాత్ర సమయంలో తనలోని ప్రజానాయకుడిని ప్రపంచానికి పరిచయం చేసిన లోకేష్... పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు కదిలారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని వెటకారాలు ఆడినా తాను అనుకున్న గమ్యస్థానాన్ని చేరారు.

మరోపక్క తన తండ్రి, పార్టీ పెద్ద దిక్కు జైలుపాలయ్యారు. ఇటు తండ్రి బెయిల్ కోసం లాయర్లతో మంతనాలు.. ఇటు పార్టీ కార్యకర్తలను, నేతలకు ధైర్యం చెప్పడాలు.. భవిష్యత్తుపై భరోసా కల్పించడాలు.. ఎన్నికల ముందు శ్రేణుల్లో పట్టు సడలకుండా.. దిగాలు పడకుండా.. ఇంటా బయటా ధైర్యం చెబుతూ ముందుకు కదిలిన ధీశాలి నారా లోకేష్.

నవ్విన నాపచేనే పండుతుంది అంటారు.. నిన్న లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అన్నారు. మంగళగిరిలో ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ మళ్లీ అక్కడినుంచే ఫోటీ చేసి 91,413 మెజారిటీతో గెలిచారు. ఈ మెజారిటీ చూసినవారు.. ఇది ఎమ్మెల్యే మెజారిటీనా ఎంపీ మెజారిటీనా అని అడిగినా అతిశయోక్తికాదనే చెప్పాలి. ఈ జనరేషన్ కి ఒక సక్సెస్ ఫుల్ ఫార్ములా కం ఇన్ స్పిరేషన్ లా మారిపోయారు లోకేష్.

ఈ సమయంలో లోకేష్ ని ఒక్కమాట అన్నా ఆయన అభిమానులు ఊరుకోవడం లేదు. కంటికి కన్ను, పంటికి పన్ను అనేల పరిస్థితి మారిపోయింది! ఇంతకాలం లోకేష్ పై విమర్శలు చేసిన వారికి తగిన బుద్దిచెబుతుంది ఆయన సైన్యం..! ఇందులో భాగంగా తాజాగా మంగళగిరిలో ఆయన ఫోటోకు క్షమాపణ చెప్పించిన వీడియో వైరల్ గా మారింది.

అది సహేతుకమా, సమర్ధనీయమా కాదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... లోకేష్ రేంజ్ మాత్రం ఒక్కసారిగా మారిపోయిందనడానికి అదో ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇప్పుడు లోకేష్ ని విమర్శించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొవాలి.. ఆయనపై ట్రోల్ చేయాలంటే ఒళ్లు దగ్గరపెట్టుకోవాలనే హెచ్చరికలు ఆయన సైన్యం సమాజానికి పంపిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు లోకేష్ వ్యక్తి కాదు... శక్తి! తండ్రికి తగ్గ తనయుడు కాదు.. తండ్రిని మించిన తనయుడు! రాజకీయాలకు పనికిరాని వ్యక్తి కాదు.. భవిష్యత్ రాజకీయాలను శాసించే శక్తి! దటీజ్ నారా లోకేష్... దిసీజ్ రైజ్ ఆఫ్ నారా లోకేష్!