వీడియో వైరల్.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే పోలీసులు ఏం చేశారంటే!
అయితే ఈ క్రమంలో బైక్ నెంబర్ ప్లేట్ కనపడకుండా.. అలాగే కొందరు పూర్తిగా నంబర్ ప్లేట్ తొలగించి.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ నంబర్ ప్లేట్ సైజులో తమ బైకులకు పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 7 July 2024 8:15 AM GMTఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏపీ కేబినెట్ లోనూ భాగమైన ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, అడవులు, పర్యావరణం, శాస్త్రసాంకేతిక శాఖలకు మంత్రిగా ఉన్నారు.
కాగా పవన్ కళ్యాణ్ గెలుపొందినప్పటి నుంచి ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా తమ బైకులు, కార్లపైన పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ ముద్రించుకుంటున్న సంగతి తెలిసిందే. తద్వారా పవన్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కేవలం పిఠాపురంలోనే కాకుండా రాష్ట్రమంతా ఇదే ట్రెండ్ ఉంది.
అయితే ఈ క్రమంలో బైక్ నెంబర్ ప్లేట్ కనపడకుండా.. అలాగే కొందరు పూర్తిగా నంబర్ ప్లేట్ తొలగించి.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ నంబర్ ప్లేట్ సైజులో తమ బైకులకు పెట్టుకున్నారు. దీంతో నంబర్ ప్లేట్ కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఇలాగే ఒక స్కూటీపై వస్తున్న ఇద్దరు యువకులను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ స్కూటీకి నంబర్ ప్లేట్ లేదు. దాని స్థానంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసి ఉన్న ప్లేట్ ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసు.. మీ ఇద్దరిలో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఎవరు ఆ ఇద్దరు యువకులను ప్రశ్నించారు. దానికి ఆ యువకుడు ఇద్దరం అని చెప్పాడు. ఈ బండి ఎవరిది అని ట్రాఫిక్ పోలీసు చెప్పగా.. తనదేనని వారిద్దరిలో ఓ యువకుడు చెప్పాడు.
దీంతో ట్రాఫిక్ పోలీసు ఆ యువకుడికి క్లాసు పీకారు. ఇలా నంబర్ ప్లేట్ స్థానంలో ఇలా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాయొద్దని సూచించారు. నంబర్ ప్లేట్ లేకపోతే.. ఒకవేళ బండి దొంగతనానికి గురయితే దాన్ని కనుక్కోవడం కష్టమవుతుందని ఆ యువకులకు వివరించారు. నంబర్ ప్లేట్ స్థానంలో కాకుండా బండి పైన మీకు నచ్చిన చోట రాసుకుంటే తాము ఏమీ అనమని, పట్టించుకోబోమని తెలిపారు. నంబర్ ప్లేట్ మాత్రం స్పష్టం కనిపించాల్సిందేనని ట్రాఫిక్ పోలీసు తేల్చిచెప్పారు.
అంతేకాకుండా నంబర్ ప్లేట్ ఎక్కడ ఉందని ఆ యువకులను ట్రాఫిక్ పోలీసు ప్రశ్నించారు. డిక్కీలో ఉందని యువకుడు చెప్పగా దాన్ని బయటకు తీయించి.. స్కూటీకి ఆ యువకుడితోనే అమర్చేలా చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే ప్లేట్ ను తొలగించి.. దాని స్థానంలో బండి నంబర్ ప్లేట్ ను ఉంచారు. ఎప్పుడూ ఇలా నంబర్ ప్లేట్ స్థానంలో వేరే వాటిని ఉంచొద్దని ట్రాఫిక్ పోలీసు సూచించారు. నంబర్ ప్లేట్ ను వదిలేసి బండిపైన మిగతా ఎక్కడైనా మీకు నచ్చినవి రాయించుకోవచ్చన్నారు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనసేన శ్రేణులు కూడా దీన్ని వైరల్ చేస్తున్నాయి. ఆ ఒక్క చోట కాకుండా ఎక్కడైనా వేయించుకోండి అంటూ తమ తోటి అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు.