Begin typing your search above and press return to search.

300 కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన విరాట్ కోహ్లీ?

ఇకపై విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాలలో వన్8 బ్రాండ్‌ను విస్తృతంగా ప్రచారం చేయనున్నాడు.

By:  Tupaki Desk   |   12 April 2025 8:30 PM
300 కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన విరాట్ కోహ్లీ?
X

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు స్టార్ బ్యాట్స్‌మెన్‌గా, ప్రపంచంలోని ప్రముఖ క్రీడా సెలబ్రిటీలలో ఒకడిగా విరాట్ కోహ్లీకి తిరుగులేని క్రేజ్ ఉంది. దీంతో దిగ్గజ బ్రాండ్‌లు అతడితో ఒప్పందం కుదుర్చుకునేందుకు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలోనే కోహ్లీ తన బ్రాండ్ విలువకు తగ్గట్టుగా భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటూ వివిధ ఉత్పత్తులను ప్రచారం చేస్తుంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అతడి పోస్టులకు ఉండే విశేషమైన రీచ్‌ను బ్రాండ్‌లు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంటాయి.

తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గత ఎనిమిదేళ్లుగా జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ పూమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కోహ్లీ ఆ ఒప్పందాన్ని ముగించుకున్నాడు. 2017 నుండి కొనసాగుతున్న ఈ భాగస్వామ్యం తాజాగా ముగియడంతో, పూమా మరోసారి కోహ్లీని తమ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంది. ఇందుకోసం ఏకంగా ఎనిమిదేళ్ల కాలానికి గాను రూ. 300 కోట్ల భారీ ఆఫర్‌ను కూడా ఇచ్చింది.

అయితే, విరాట్ కోహ్లీ మాత్రం పూమా ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి సూచనగా అతడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పూమాకు సంబంధించిన అన్ని ప్రకటనలను, రీల్స్‌ను తొలగించాడు.

మైదానంలో పరుగుల వరద పారించే కింగ్ కోహ్లీ, వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఒకవైపు ప్రకటనల ద్వారా భారీగా సంపాదిస్తూనే, మరోవైపు హోటల్స్, క్లాతింగ్ వంటి వ్యాపారాల్లోనూ రాణిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం తన సొంత బ్రాండ్ అయిన వన్8 (one8)ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు కోహ్లీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. స్పోర్ట్స్‌వేర్, ఫుట్‌వేర్, దుస్తులు వంటి విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వన్8ను మరింత విస్తరించాలనే లక్ష్యంతోనే కోహ్లీ పూమాతో తన బంధాన్ని తెంచుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపై విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాలలో వన్8 బ్రాండ్‌ను విస్తృతంగా ప్రచారం చేయనున్నాడు. తనకున్న ఫాలోయింగ్‌తో తన ఉత్పత్తులను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని యోచిస్తున్నాడు. అంతేకాకుండా, అతడు ప్రముఖ క్రీడా అథ్లెట్ల సంస్థ అయిన అజిలిటాస్‌లో కూడా పెట్టుబడిదారుడిగా చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి విరాట్ కోహ్లీ కేవలం ఆటలోనే కాకుండా, వ్యాపారంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.