Begin typing your search above and press return to search.

ఈ వీసా దరఖాస్తుల్లో రికార్డులు బ్రేక్‌!

భారత్‌ లో హెచ్‌ 1 వీసా దరఖాస్తులు రికార్డు స్థాయిలో పెరిగాయి. కరోనా తర్వాత హెచ్‌ 1 వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య కొంత తగ్గింది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 6:58 AM GMT
ఈ వీసా దరఖాస్తుల్లో రికార్డులు బ్రేక్‌!
X

భారత్‌ లో హెచ్‌ 1 వీసా దరఖాస్తులు రికార్డు స్థాయిలో పెరిగాయి. కరోనా తర్వాత హెచ్‌ 1 వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య కొంత తగ్గింది. మళ్లీ ఇప్పుడు కరోనా ముందు నాటికి ఉన్న వీసా దరఖాస్తుల పరిస్థితికి చేరుకుంది. అంతేకాకుండా కరోనా ముందు నాటికి ఉన్న వీసా దరఖాస్తుల రికార్డు ఇప్పుడు బ్రేక్‌ అయ్యింది. ఈ విషయాన్ని వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ వెల్లడించింది.

అమెరికాలో వర్క్‌ పర్మిట్‌ లేదా ఎడ్యుకేషన్‌ వర్క్‌ నిమిత్తం వెళ్లేవారికి హెచ్‌ 1 వీసా జారీ చేస్తారనే విషయం తెలిసిందే. హెచ్‌ 1 వీసా ఉంటే గ్రీన్‌ కార్డు (అమెరికాలో శాశ్వత నివాసానికి మార్గం) త్వరగా లభిస్తుందని భావిస్తారు. ఈ నేపథ్యంలో హెచ్‌ 1 వీసాకు హెవీ డిమాండ్‌ ఉంటోంది.

వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ ప్రకారం.. భారతదేశం నుండి హెచ్‌ 1 వీసా దరఖాస్తులు మొదటిసారిగా కరోనా ముందు స్థాయిని అధిగమించాయి. 2024 మొదటి అర్ధ భాగంలో (జనవరి నుండి జూన్‌ వరకు).. 2019లో ఇదే కాలంతో పోలిస్తే వీసా దరఖాస్తులు 2% పెరిగాయి. అలాగే 2023 మొదటి సగం (జనవరి – జూన్‌)తో పోలిస్తే దరఖాస్తులు 11% పెరిగాయి.

హెచ్‌ 1 వీసాల కోసం ఈ డిమాండ్‌ కొనసాగుతుందని భావిస్తున్నారు. గత రెండేళ్లుగా పరిస్థితులు చక్కబడ్డాయి. దీంతో హెచ్‌ 1 వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితి ఈ ఏడాది చివరి వరకు కొనసాగవచ్చని చెబుతున్నారు.

కేవలం ఒక్క అమెరికాకే కాకుండా కెనడా, యూకే, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌ దేశాలకు వీసా దరఖాస్తులు పెరుగుతున్నాయని వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ వెల్లడించింది.

‘మీ ఇంటి వద్దే వీసా’ (వీసా యువర్‌ డోర్‌ స్టెప్‌).. సేవ కోసం డిమాండ్‌ పెరుగుతోంది. ఈ విషయంలోనూ గణనీయమైన వృద్ధి చోటు చేసుకుంటోంది. ఈ విధానంలో వీసా కావాల్సినవారు ఇంటి నుంచే వీసా దరఖాస్తులను సమర్పించవచ్చు. వీసా యువర్‌ డోర్‌ స్టెప్‌ దరఖాస్తులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2024 మొదటి అర్ధ భాగంలో 16% పెరిగాయి. 2019తో పోలిస్తే 5 రెట్లు పెరగడం విశేషం.