కొట్టు-కొట్టు కొబ్బరికాయ.. `వీసా` దేవుళ్లకు ఫుల్లు డిమండ్!
ఇతరదేశాలకు వెళ్లేవారు.. ముఖ్యంగా అమెరికాకు వెళ్లేవారు.. వీసాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ఈ ఆలయాలలోని దేవుళ్లకు మొక్కుతారు.
By: Tupaki Desk | 7 Feb 2025 4:11 AM GMTదేశవ్యాప్తంగా వీసా దేవుళ్లుగా ప్రసిద్ధి చెందిన.. ప్రచారంలో ఉన్న దేవుళ్లకు భారీ గొప్ప డిమాండ్ పెరిగిపో యింది. ఆయా ఆలయాలకు నిన్న మొన్నటి వరకు పెద్ద రద్దీ లేకపోయినా.. ఇప్పుడు వీఐపీ దర్శనం దక్కించుకోవడం కూడా.. కష్టసాధ్యంగా మారిందట. తెలంగాణ, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ఆలయాలు వీసాలకు ప్రసిద్ధి. అంటే.. ఇతరదేశాలకు వెళ్లేవారు.. ముఖ్యంగా అమెరికాకు వెళ్లేవారు.. వీసాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ఈ ఆలయాలలోని దేవుళ్లకు మొక్కుతారు.
అలా మొక్కుకోగానే.. ఇలా వీసా లభిస్తుందనే ప్రగాఢ నమ్మకం కూడా భక్తులకు ఉంది. అయితే.. ఇది సర్వసాధారణమే కదా.. ఇప్పుడు ఎందుకు ఇంత డిమాండ్ అనే ప్రశ్న ఉదయిస్తుంది. ప్రస్తుతం అమెరికా వెళ్లాలనుకునేవారికి కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుకట్ట వేస్తున్నారు. వీసాల విషయంలో కొత్త నిబంధనలు పెట్టి.. కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారిని కట్టడి చేస్తున్నారు. దీంతో వీసాలు లభిస్తాయో లేదో.. అనే బెంగ అగ్రరాజ్యంపై ఆశలు పెట్టుకున్న వారిని వేధిస్తోంది.
దీంతో దేశవ్యాప్తంగా గత వారం నుంచి ఆయా వీసా దేవుళ్ల ఆలయాల్లో ప్రత్యేక పూజల టికెట్లు హాట్ కేకుల్లో ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నాయి. ఒకప్పుడు ఆలయంలోనే కొనుగోలు చేసే ప్రత్యేక పూజల టికెట్లను ప్రస్తుత రద్దీ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారట. దీంతో టీటీడీ కన్నా ఎక్కువగా క్షణాల్లో నే ఈ టికెట్లు కూడా బుక్ అవుతున్నాయని సదరు ఆలయాల అధికారులు చెబుతున్నారు. ఇక, సాధారణ భక్తుల క్యూలు నాలుగింతలు పెరిగిపోయాయని అంటున్నారు. పనిలో పనిగా భక్తుల రద్దీ పెరగడంతో ఆలయాలకు వచ్చే ఆదాయం కూడా ఐదింతలు పెరిగిందని చెబుతున్నారు.
ఇవీ.. వీసా దేవుళ్ల ఆలయాలు..
+ తెలంగాణ: చిలుకూరు బాలజీ టెంపుల్
+ తమిళనాడు: చెన్నైలోని లక్ష్మీ గణపతి ఆలయం
+ గుజరాత్: అహ్మదాబాద్‌లోని హనుమాన్ గుడి
+ ఢిల్లీ: శ్రీ సిద్ధి పీఠ్ చమత్కారీ హనుమాన్ మందిర్
+ పంజాబ్: షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా, అమృత్ సర్.