కెనడాపై భారత విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు.. వీసాలు బంద్!
ఈ నేపథ్యంలో భద్రతాపరమైన ఉద్రిక్తతల కారణంగా కెనడియన్ల వీసా దరఖాస్తులను ప్రక్రియలను పూర్తిచేయలేకపోతున్నామని తెలిపారు.
By: Tupaki Desk | 21 Sep 2023 4:14 PM GMTగతకొన్ని రోజులుగా కెనడా – భారత్ ల మధ్య ఖలిస్థానీ అంశంపై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరుదేశాలూ తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నాయి. ఈ సమయంలో కెనడా వ్యవహరిస్తున్న తీరుపై భారత్ మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును... ఖలిస్థానీ అంశంపై కెనడా వ్యవహరిస్తున్న తీరు, భారత్ పై చేస్తున్న ఆరోపణలపై మన విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. తీవ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా కెనడా మారిందని ధ్వజమెత్తింది. కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందం బాగ్చి ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో... భద్రతాపరమైన పరిస్థితుల కారణంగా కెనడియన్లకు వీసా సర్వీసులను నిలిపివేసినట్లు అరీందం బాగ్చి ధ్రువీకరించారు. హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని చేసిన ఆరోపణలు.. పూర్తిగా అవకాశవాద రాజకీయ ప్రేరేపితమేనని దుయ్యబట్టారు.
ఈ విషయాలపై మరింత వివరణ ఇచ్చిన బాగ్చీ... హర్ దీప్ సింగ్ నిజ్జర్ ఘటన గురించి ఆ దేశం ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు కానీ... ఆ దేశంలో జరుగుతున్న నేరపూరిత కార్యకలాపాలకు సంబంధించి అన్ని ఆధారాలను ఆ దేశానికి ఇచ్చామని తెలిపారు. ఇదే క్రమంలో ఆ దేశంలో ఉన్న 20-25 మంది వ్యక్తులను మన దేశానికి అప్పగించాలని కోరగా... అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... కెనడాలో భారత హైకమిషన్లు, కాన్సులేట్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు పెరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో భద్రతాపరమైన ఉద్రిక్తతల కారణంగా కెనడియన్ల వీసా దరఖాస్తులను ప్రక్రియలను పూర్తిచేయలేకపోతున్నామని తెలిపారు. దీనికి కారణం కాన్సులేట్లు, హైకమిషన్లు తమ తమ సాధారణ కార్యకలాపాలను ఈ ఆటంకాల వల్ల కొనసాగించలేకపోతున్నాయని అన్నారు.
అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చిన బాగ్చీ... కెనడా నుంచే కకుండా... ఇతర దేశాల నుంచి దరఖాస్తులు చేసుకునే కెనడియన్లకు కూడా వీసాలు ఇవ్వలేం అని తేల్చి చెప్పారు. అయితే... కెనడియన్లు భారత్ కు రాకుండా అడ్డుకోవాలనేది తమ విధానం కాదని.. సస్పెన్షన్ ఉత్తర్వులకు ముందు జారీ అయిన వీసాలు కలిగి ఉన్న వారు ఎప్పుడైనా ఇండియాకు రావొచ్చని క్లారిటీ ఇచ్చారు.