ఆన్ లైన్ లో బదిలీ అయిన రూ.8కోట్లు ఆ సంస్థవా?
తాజాగా జరిగిన ఒక అనుమానాస్పదంగా లావాదేవీపై కన్నేసిన అధికారులు చివరకు రూ.8 కోట్ల భారీ మొత్తాన్ని సీజ్ చేయటం ఆసక్తికరంగా మారింది
By: Tupaki Desk | 20 Nov 2023 5:06 AM GMTఎన్నికల వేళ అక్రమంగా తరలించే నోట్ల కట్టల్ని పట్టుకోవటం తెలిసిందే. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ నేపథ్యంలో అక్రమంగా జరిగే ఆన్ లైన్ లావాదేవీలపై ఒక కన్నేసి ఉంచాయి ఆయా ఆర్థిక సంస్థలు. తాజాగా జరిగిన ఒక అనుమానాస్పదంగా లావాదేవీపై కన్నేసిన అధికారులు చివరకు రూ.8 కోట్ల భారీ మొత్తాన్ని సీజ్ చేయటం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందిన సదరు కంపెనీ నుంచి రూ.8 కోట్ల మొత్తం ఆన్ లైన్ లో ట్రాన్సఫర్ అయ్యింది. బషీర్ బాగ్ లోని ఒక బ్యాంక్ ఖాతా నుంచి ఆన్ లైన్ లో బదిలీ అయిన ఈ భారీ మొత్తాన్ని సెంట్రల్ జోన్ పోలీసులు ఫ్రీజ్ చేశారు.
నవంబరు 13న ఉదయం హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్ లోని విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఒక ఖాతా నుంచి ఐడీబీఐ బ్యాంక్ బషీర్ బాగ్ బ్రాంచికి చెందిన విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ ఖాతాకు రూ.8 కోట్లు జమైంది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి దాని వెనుక లెక్కల్ని ఆరా తీయగా అనుమానాస్పద వైఖరి కనిపించింది. దీంతో.. సదరు ఖాతాను ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్.. నోడల్ అధికారి.. ఆదాయపన్నుశాఖ.. ఈడీ జాయింట్ డైరెక్టర్లకు లేఖ ద్వారా నిధుల్ని ఫ్రీజ్ చేసిన విషయాన్ని తెలియజేసినట్లుగా డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. రెండు సంస్థల ఖాతాల్లోకి భారీ ఎత్తున నగదు జమ చేసిన వారి గురించి ఆరా తీస్తున్నట్లుగా డీసీపీ పేర్కొన్నారు. పూర్తి ఆధారాల కోసం విచారిస్తున్నామని.. వాటి వివరాలు తెలిసినంతనే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కీలక నాయకుడి కోసమే ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందన్న మాట వినిపిస్తోంది.