వైసీపీకి మరో షాక్
ఆనంద్ తోపాటు మొత్తం 10 మంది డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. విశాఖ డెయిరీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని కూటమి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.
By: Tupaki Desk | 20 Dec 2024 11:30 PM GMTవిశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి షాక్ ఇచ్చారు. 2019లో వైసీపీలో చేరిన అడారి గత ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ఆకస్మికంగా పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ఆనంద్ తోపాటు మొత్తం 10 మంది డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. విశాఖ డెయిరీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని కూటమి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. చైర్మన్ ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులు డెయిరీని తమ సొంత జాగీరుగా మార్చుకుని ఇష్టాసారం వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా విశాఖ డెయిరీ కార్యకలాపాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డెయిరీలో అక్రమాలు నిగ్గు తేలుస్తామంటూ శాసనసభా సంఘాన్ని నియమించారు. టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలోని కమిటీ ఈ మధ్యనే విశాఖలోని డెయిరీ కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఆ సమయంలో డెయిరీ చైర్మన్ ఆనంద్ కుమార్ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎక్కువవుతుండటంతో వైసీపీ నుంచి బయటకు రావడమే మేలు అనుకున్న ఆనంద్ ఆకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు సోదరి పీలా రమాకుమారి కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.
వాస్తవానికి విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమారుది తొలి నుంచి తెలుగుదేశం కుటుంబమే. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన అనకాపల్లి పార్లమెంటుకు పోటీచేశారు. ఆయన తండ్రి విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసీరావు 1973లో విశాఖ డెయిరీని స్థాపించారు. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలో పాడి రైతులకు ఇందులో భాగస్వామ్యం ఉంది. 1999లో ‘శ్రీ విజయ విశాఖ జిల్లా పాల ఉత్పత్తిదారులు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్’గా రిజిస్టరైన విశాఖ డెయిరీ 2006లో శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఇలా డెయిరీని అన్నివిధాలుగా అభివృద్ధి చేసిన తులసీరావు తొలి నుంచి తెలుగుదేశం నేతగా గుర్తింపు పొందారు. ఆయన తుది శ్వాస విడిచేవరకు ఆ పార్టీలోనే కొనసాగారు.
అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా పార్టీ మారలేదు. ఆయన అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన తర్వాత ఆనంద్ కుమార్ వైసీపీలో చేరాల్సివచ్చింది. ఆ తర్వాత తండ్రి మరణం తర్వాత విశాఖ డెయిరీ చైర్మన్ అయ్యారు ఆనంద్ కుమార్. డెయిరీ నిధులను వైసీపీ పార్టీకి మళ్లించారని, డెయిరీ ఆస్పత్రి, ఐస్ క్రీం ఫ్యాక్టరీ ఇతర ఆస్తుల విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా, ఈ ఆరోపణలను పెద్దగా లెక్క చేయని డెయిరీ చైర్మన్ ఆనంద్ కూటమి ప్రభుత్వానికి తలొగ్గక తగ్గలేదు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా నేతల్లో చాలా మంది అడారిపై ఆగ్రహంగా ఉండటం, సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కన్నెర్రజేయడంతో అడారిని ఆదుకునేవారు కరువయ్యారు.
ప్రతికూల పరిస్థితుల్లో వైసీపీ నుంచి బయటకు వచ్చిన అడారి ఆనంద్ బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత గూటికి మళ్లీ వెళదామంటే ఆదరించేవారు లేరని, తనపై చర్యలు లేకుండా ఉండాలంటే బీజేపీలో చేరడం ఒక్కటే మంచి మార్గమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. అడారి రాజీనామా వైసీపీకి కూడా తీవ్ర నష్టమనే చెప్పాలి. ఇప్పటికే ఆ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఇప్పుడు అడారి రాజీనామాతో ఒకే నెలలో ఇద్దరు కీలక నేతలు బయటకు వచ్చినట్లు చెప్పొచ్చు.