Begin typing your search above and press return to search.

విశాఖ మేయర్ సీటుకు ఎసరు ?

ఇక ముహూర్తం కనుక నిర్ణయించుకుంటే మేయర్ పీఠాన్ని ఎక్కడమే తరువాయి అన్నట్లుగా ఉంది. టీడీపీకి మేయర్ ఇచ్చి జనసేనకు డిప్యూటీ మేయర్ ఇస్తారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Dec 2024 3:47 AM GMT
విశాఖ మేయర్ సీటుకు ఎసరు ?
X

విశాఖ మేయర్ సీటుకు ఎసరు పెడుతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ లో వైసీపీకి మెజారిటీ అంతకంతకు లేకుండా పోతోంది. ఈ మధ్యనే జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో పదికి పది స్థానాలను కూటమి గెలుచుకుని వైసీపీకి ఖంగు తినిపించింది. ఈ రోజున అవిశ్వాసం పెడితే వైసీపీ మేయర్ కుర్చీ ఖాళీ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

విశాఖ కార్పోరేషన్ లో 98 మంది కార్పోరేటర్లు ఉన్నారు. మేయర్ పీఠం దక్కించుకోవాలీ అంటే మ్యాజిక్ ఫిగర్ 50 మంది ఉండాలి. ఇక వీరు కాకుండా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. వారికి కూడా ఓటు హక్కు ఉంటుంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు, ఎంపీలు, అలాగే ఒక ఎమ్మెల్సీ టీడీపీ కూటమికి మద్దతుగా ఉన్నారు.

ఇక కార్పోరేటర్లలో బలం చూస్తే వైసీపీకి 60 మంది దాకా కార్పోరేటర్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 45కి పడిపోయింది. అంటే మైనారిటీలో ఉంది అన్న మాట. అదే సమయంలో 29 దాకా టీడీపీకి కార్పోరేటర్లు ఉన్నారు. జనసేనకు ముగ్గురు, బీజేపీకి ఒకరు కలుపుకుంటే ఆ సంఖ్య 34కి చేరింది.

మరో వైపు నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి 10 మంది కార్పోరేటర్లు చేరితే 5 మంది జనసేనలో చేరారు. ఈ లెక్కన తీసుకుంటే 49 మంది కార్పోరేటర్ల మద్దతు ఈ రోజుకు జీవీఎంసీలో కూటమికి ఉంది. మరో నలుగురు ఇండిపెండెంట్ల మద్దతు కూడా ఉందని అంటున్నారు. అంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ మద్దతు లేకుండానే విశాఖ మేయర్ టీడీపీ కూటమి పరం అవుతుంది.

దీనికి తోడు మరింతమంది వైసీపీ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఇక 2021లో జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. నాలుగేళ్ళ దాకా అవిశ్వాసం పెట్టకూడదు అని వైసీపీ చట్ట సవరణ చేసింది. ఇటీవల పంచాయతీలలో దానికి మార్పు చేశారు. అదే మునిసిపాలిటీలకు కూడా చేస్తారు అని అంటున్నారు. ఆ విధంగా జరిగితే మాత్రం విశాఖ మేయర్ సీటు కూటమి పరం అవుతుంది అని అంటున్నారు.

విశాఖ మేయర్ గా హరి వెంకట కుమారి వైసీపీ నుంచి ఉన్నారు. అయితే టీడీపీ కూటమి నుంచి మేయర్ కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. విశాఖ వంటి మెగా సిటీలో పాలన తమ చేతులలోకి తీసుకోవాలని చూస్తున్నారు. పరిస్థితులు అయితే రాజకీయంగా టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి.

ఇక ముహూర్తం కనుక నిర్ణయించుకుంటే మేయర్ పీఠాన్ని ఎక్కడమే తరువాయి అన్నట్లుగా ఉంది. టీడీపీకి మేయర్ ఇచ్చి జనసేనకు డిప్యూటీ మేయర్ ఇస్తారు అని అంటున్నారు. విశాఖ కార్పోరేషన్ మీద టీడీపీ కూటమి ఫోకస్ బాగా పెడుతోంది. మరో వైపు చూస్తే వైసీపీ నుంచి కొత్తగా ఎమ్మెల్సీగా అయిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ పార్టీకి బలంగా ఉన్నారు. కానీ నంబర్ గేం కాబట్టి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.