విశాఖపట్నంలోని ఆ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం..
విశాఖపట్నంలోని జగదాంబ కూడలి సమీపంలోని ఇండస్ హాస్పిటల్ లో గురువారం (డిసెంబర్ 14) అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్ లోని మొదటి అంతస్తులోని ఆపరేషన్ థియేటర్లో మంటలు వ్యాపించాయి.
By: Tupaki Desk | 14 Dec 2023 9:30 AM GMTప్రాణాలను కాపాడే దేవాలయాలుగా హాస్పిటల్స్ ను చూస్తారు. కానీ అక్కడక్కడ భద్రతా పరమైన లోపాలతో అక్కడకూడా భద్రత కరువైందని వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. హాస్పిటల్స్ లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అగ్ని మాపక సిబ్బంది చెప్తున్నా.. ఈ లోపాలను పట్టించుకోకపోవడంతో అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తీవ్ర అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చిన రోగులు తప్పించుకునే వీలు లేకపోవడంతో ఇలా హాస్పిటల్స్ లో ప్రమాదాలు సంభవిస్తే ఎక్కువ మరణాలకు దారి తీస్తుంది.
విశాఖపట్నంలోని జగదాంబ కూడలి సమీపంలోని ఇండస్ హాస్పిటల్ లో గురువారం (డిసెంబర్ 14) అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్ లోని మొదటి అంతస్తులోని ఆపరేషన్ థియేటర్లో మంటలు వ్యాపించాయి. ఇవి భారీగా వ్యాపిస్తూ తర్వాతి అంతస్తుకు పాగాయి. దీంతో హాస్పిటల్ లోని అన్ని విభాగాలు పొగలో కమ్మకుపోయాయి. దీంతో రోగుల బంధువులు, స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటా హుటిన హాస్పిటల్ చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హాస్పిటల్ లో సుమారు 40 మంది రోగులను ప్రత్యేక అంబులెన్స్‌లలో వివిధ హాస్పిటల్స్ కు తరలించారు.
అయితే, ఆపరేషన్ థియేటర్ లో నైట్రస్ ఆక్సైడ్ కారణంగా మంటలు అంటుకోవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. దట్టమైన పొగ కమ్ముకోగా.. పై అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డుల్లో రోగులను నిచ్చెనల సాయంతో కిందికి దింపారు. ఈప్రమాదంతో రోగులు, వారి బంధువుల, స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామన్న ఫైర్ అధికారులు. భద్రతా పరమైన లోపాలపై కూడా హాస్పిటల్ యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
ఏది ఏమైనా అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ప్రాణాపాయం ఎలాంటి సంభవించకపోవడంతో రోగుల బంధువులు, హాస్పిటల్ యాజమాన్యంతో పాటు స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు జాగ్రత్తలతోనే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనతో ఏపీలో తీవ్ర చర్చ జరుగతోంది. హాస్పిటల్స్ భద్రతపై మరోసారి తనిఖీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.