విశాఖను పొగిడి ఉబ్బేస్తున్నారా ?
ఆనాడు విశాఖ జిల్లా అంటే ఉత్తరాంధ్రలోని విశాఖ శ్రీకాకుళం విజయనగరం తో పాటు ఈ రోజు ఒడిషా రాష్ట్రంలో ఉన్న పర్లాకిమిడి దాకా అని చెబుతారు.
By: Tupaki Desk | 8 Dec 2024 3:27 AM GMTవిశాఖ అంటే ఈ రోజు ఎవరో గుర్తించినది కాదు, ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన ఓడరేవు ఉంది. విశాఖ భవిష్యత్తుని ఊహించినది ముందుగా గుర్తించినది బ్రిటిష్ వారు. 1900 సంవత్సరంలోనే విశాఖను జిల్లాగా ప్రకటించిన ఘనత వారికే దక్కుతుంది. ఆనాడు విశాఖ జిల్లా అంటే ఉత్తరాంధ్రలోని విశాఖ శ్రీకాకుళం విజయనగరం తో పాటు ఈ రోజు ఒడిషా రాష్ట్రంలో ఉన్న పర్లాకిమిడి దాకా అని చెబుతారు.
అంతే కాదు విశాఖకు రైల్వే లైన్ వేశారు, పోర్టు, ఆంధ్రా విశ్వవిద్యాలయం సహా అనేక సంస్థలను తీసుకుని వచ్చారు. ఆ విధంగా విశాఖ స్వాతంత్య్రానికి ముందే అభివృద్ధి చెందింది. సముద్ర తీర ప్రాంతం ఉంటే ఆ నగరం బాగా ప్రగతి బాటన పడుతుందని గుర్తించిన వారు ఆంగ్లేయులు. చవకగా జల రవాణాను వారు ఉపయోగించుకోవడం ద్వారా విశాఖను ప్రధాన వాణిజ్య నగరంగా తీర్చిదిద్దారు. విశాఖలో తొలి పురపాలక సంఘం కూడా 18వ దశకం మధ్యలో ఏర్పడింది అంటే పాలనా పరంగా కూడా వారు తీసుకున్న చర్యలే అని అంటారు.
స్వాతంత్ర్యం తరువాత విశాఖకు కేంద్ర రాష్ట్ర పరిశ్రమలు అనేకం వచ్చాయి. అలా విశాఖ నెమ్మదిగా ఎదిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ తో రూపు రేఖలు మారిపోయాయి. పచ్చని చెట్లు కొండలు సముద్ర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణంతో విశాఖ ఏనడో సిటీ ఆఫ్ డెస్టినీ అయిపోయింది.
విశాఖను ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని చేయాలని ప్రతిపాదనలు ఎన్నో వచ్చాయి. విశాలాంధ్ర ఏర్పాటు కాకపోయి ఉంటే 1954లోనే విశాఖ ఏపీకి రాజధాని అయ్యేదని కూడా చరిత్రలో ఉంది. అయితే విశాఖకు రాజసం ఉన్నా రాజధాని హోదా లేదు. అయినా దానికి చింత కూడా లేదు.
మెగా సిటీ అంటే విశాఖనే చెబుతారు. ఈ రోజుకీ విశాఖ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలతో పోటీ పడే స్థితిలో ఉంది. రేపటికి ఇంకా ఎదుగుతుంది అని ధీమా ఉంది. ఇవనీ పక్కన పెడితే విశాఖ స్వయంసిద్ధంగా ఎదిగింది. ఈ విషయంలో ప్రభుత్వాల కృషి కంటే విశాఖకు ఉన్న హంగులే అలా కలసి వచ్చేలా చేశాయని అంటారు.
అయితే టీడీపీ ప్రభుత్వం అయినా వైసీపీ ప్రభుత్వం అయినా విశాఖ గ్రేట్ అంటూ కితాబులు ఇవ్వడం ద్వారా ఉబ్బేస్తున్నారు అని అంటున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని అని వైసీపీ పాలకులు చెబుతూ పుణ్య కాలం అంతా గడిపేశారు. ఇక టీడీపీ పాలకులు గతంలో అయితే విశాఖకు ఆర్థిక రాజధాని అని పేరు పెట్టారు. కల్చరల్ సిటీ అన్నారు. సినీ రాజధాని అని టూరిజం హబ్ అని ఐటీ సెక్టార్ అని ఇలా ఎన్నో రకాలుగా పొగుడుతూ వచ్చారు.
ఇపుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో విశాఖను ఫ్యూచర్ సిటీగా అభివర్ణిస్తూ కొత్త పేరు పెట్టారు అని అంటున్నారు. విశాఖను ఆయన భవిష్యత్తు నగరం అని అభివర్ణించారు. దానిని మేధావులతో పాటు అంతా అంగీకరిస్తున్నారు. విశాఖ ఎప్పటికీ భవిష్యత్తుని ఇచ్చే నగరమే అని అంటున్నారు.
విశాఖ ఏపీకి గ్రోత్ ఇంజన్ అని కూడా ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఏపీ ఇన్ని రకాలుగా ఇబ్బందులలో ఉన్న అందులో భారీ ఊరట విశాఖ లాంటి సిటీ ఉండడమే అని అంటారు. విశాఖ ఫ్యూచర్ ఏపీకే భరోసా అని అంటున్నారు. విశాఖను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని దానిని పాలకులు నెరవేర్చితే దేశంలోని టాప్ టెన్ సిటీలలో ఒకటిగా ఉంటుందని అంటున్నారు.
విశాఖకు ఉన్న గొప్పతనం ఏంటి అంటే అభివృద్ధి నిరంతరంగా సాగడం అంటున్నారు. అది ఎప్పటికీ ఆగేది కాదని అంతకంతకు పెంచుకుంటూ పోతూ విశాఖ దేశంలోనే అతి ముఖ్య నగరంగా మారుతోందని అంటున్నారు. ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందే సిటీగానూ విశాఖకు పేరు ఉందని అంటున్నారు. మొత్తానికి విశాఖను ఫ్యూచర్ సిటీగా బాబు పేర్కొనడం సమంజసమైనదిగానే చెబుతున్నారు.