Begin typing your search above and press return to search.

విశాఖ మేయర్ పీఠం : బిగ్ మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ కావాల్సిందే !

విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఏపీలో అతి పెద్దది. 99 మంది కార్పోరేటర్లతో కొలువు తీరింది.

By:  Tupaki Desk   |   20 March 2025 11:00 PM IST
విశాఖ మేయర్ పీఠం : బిగ్ మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ కావాల్సిందే !
X

విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఏపీలో అతి పెద్దది. 99 మంది కార్పోరేటర్లతో కొలువు తీరింది. ఈ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి టీడీపీ కూటమి వేగంగా పావులు కదుపుతున్న సంగతి విధితమే. హైకమాండ్ నుంచి ఇపుడు సానుకూలత వచ్చిందని పీఠాన్ని ఇక గెలుచుకోవడమే తరువాయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

విశాఖ మేయర్ మీద అవిశ్వాసం పెట్టాలి అంటే కొంతమంది సభ్యులతో నోటీసు ఇవ్వవచ్చు. కానీ ఆ అవిశ్వాసం నెగ్గాలి అంటే భారీ మ్యాజిక్ ఫిగర్ అవసరం అని నిబంధనలు చెబుతున్నాయి. విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ మొత్తం 99 మంది కార్పోరేటర్లతో పాటు ఎక్స్ అఫెషియో మెంబర్స్ తో కలుపుకుని 112 మందితో బలం ఉంది. ఇందులో మూడింట రెండు వంతుల మంది మద్దతు ఉంటేనే మేయర్ ని దించడం జరుగుతుంది. అంటే 75 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది.

ఇక చూస్తే వైసీపీకి కార్పొరేషన్ లో 40 మంది దాకా కార్పోరేటర్లు ఉన్నారు. సీపీఐ సీపీఎంకు చెరొకరు ఉన్నారు. వీరి మద్దతు కూటమికి అవిశ్వాసం వేళ దక్కదని అంటున్నారు. దాంతో ఎంత వైసీపీ నుంచి ఫిరాయింపులు చేసినా 75 మంది సభ్యుల మద్దతు దక్కుతుందా అన్నది చర్చగా ఉంది.

తెలుగుదేశం కూటమికి ఈ రోజుకు 70 మంది దాకా మద్దతు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరో అయిదుగురి కోసం వేట సాగుతోంది. వైసీపీ నుంచి ఆ అయిదుగురు కనుక ఈ వైపునకు దూకితే విశాఖ మేయర్ టీడీపీ కూటమి వశం అవుతుంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కనుక మేయర్ ని దించేందుకు కూటమి సర్వ శక్తులను సిద్ధం చేసుకుంది అని అంటున్నారు. సాధ్యమైనంత తొందరలోనే అవిశ్వాసం నోటీసు ఇచ్చి ప్రత్యేక సమావేశం పెట్టించాలని చూస్తున్నారు. ఇక చూస్తే కనుక వైసీపీ టీడీపీ కూటమికి ఆ బిగ్ ఫిగర్ అందకుండా చేయాలని చూస్తోంది. 75 మంది మద్దతు కూటమి పొందడం అసాధ్యమని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో తమ వైపు ఉన్న వారిని కాపాడుకునే పనిలో ఉంది.

అయితే వైసీపీ కార్పోరేటర్లను తిప్పుకునేందుకు కూటమి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో విశాఖ మేయర్ పీఠం కోసం ఎత్తులు పై ఎత్తులు సాగుతున్నాయి. ఎవరి ఇందులో విజేత అవుతారు అన్నది ఉత్కంఠగా మారుతోంది. ఇక విశాఖ మేయర్ పదవిని కూటమికి దక్కించే విషయంలో బాధ్యత తీసుకుని ముందుకు అడుగు వేస్తున్నది సీనియర్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు అని అంటున్నారు. ఆయన ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అటు హైకమాండ్ తో సంప్రదింపులు జరుపుతూ ఇటు కూటమికి మద్దతు సమకూరుస్తున్నారు అని అంటున్నారు.

విశాఖ మేయర్ గా కూటమి తరఫున టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న పీలా శ్రీనివాసరావు పేరు వినిపిస్తోంది. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయననే 2021 ఎన్నికల్లో తమ పార్టీ మేయర్ అభ్యర్థిగా అప్పట్లో టీడీపీ ప్రొజెక్ట్ చేసింది. దాంతో నాలుగేళ్ళ తరువాత అయినా ఆయన కోరిక ఈ విధంగా తీరబోతోందా అన్న చర్చ అయితే సాగుతోంది.