విశాఖలో సిద్ధమైన ఐటీ ఐకానిక్ భవనం.. కొత్త కంపెనీలకు రెడ్ కార్పెట్ స్వాగతం
ఇప్పుడు అదనంగా మరో భవనాన్ని అందుబాటులోకి తెస్తోంది. నగరం నడిబొడ్డున 11 బహుళ అంతస్తుల్లో భవనాన్ని సిద్ధం చేస్తోంది.
By: Tupaki Desk | 24 Jan 2025 9:30 AM GMTవిశాఖలో ఐటీ రంగానికి ఆతిథ్యమిచ్చేందుకు కొత్త భవనాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో కొత్త కంపెనీలు ప్రారంభించేందుకు చాలా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే తక్షణం తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన వసతులు కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో గతంలో మిలీనియం టవర్ నిర్మించిన ప్రభుత్వం.. ఇప్పుడు అదనంగా మరో భవనాన్ని అందుబాటులోకి తెస్తోంది. నగరం నడిబొడ్డున 11 బహుళ అంతస్తుల్లో భవనాన్ని సిద్ధం చేస్తోంది.
విశాఖకు తరలివస్తున్న ఐటీ కంపెనీలకు వసతుల సమకూర్చడంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ఐటీ ఇండస్ట్రీ కోసం చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా గూగుల్, టీసీఎస్ వంటి ప్రఖ్యాత సంస్థలు తమ కార్యకలాపాలు స్టార్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వీటితోపాటు దావోస్ సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న డేటా సెంటర్లు, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏఐ కేంద్రాలు, చిప్ తయారీ సంస్థలు విశాఖలో ఏర్పాటు కానున్నాయి. అయితే వీటికి తగిన మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో విశాఖలో వీఎంఆర్డీఏ నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని రెడీ చేసింది. వచ్చేనెలలో ఈ భవనం ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది.
సుమారు 1.72 ఎకరాల్లో రూ.87.50 కోట్లతో నగరం నడిబొడ్డున వీఎంఆర్డీఏ భవనాన్ని నిర్మిస్తున్నారు. నౌక ఆకారంలో ఉండే ఈ భవనంలో మొత్తం 11 అంతస్తులు ఉన్నాయి. ఇందులో ఆరు అంతస్తులను కార్యాలయాల నిర్వహణకు అనుగుణంగా తయారుచేస్తే, మిగిలిన ఐదు అంతస్తుల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. మొత్తం 430 కార్లు, అంతే సంఖ్యలో దిచక్రవాహనాలు ఇక్కడ పార్క్ చేయొచ్చు. మొత్తం 1.65 లక్షల చదరపు అడుగుల వర్కింగ్ స్పేస్ అందుబాటులోకి రావడంతో కనీసం నాలుగు వేల మంది పనిచేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
గ్లోబల్ కేపబులిటీ సెంటర్, డేటా ఇంక్యుబేషన్ సెంటర్లకు వీలుగా ఈ ఐకానిక్ భవనం ఉండటంతో ఎంఎన్సీలకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. నగరం నడిబొడ్డున ఉండే ఈ భవనంలో ఐటీ కంపెనీ ప్రారంభమైతే ఓ బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విశాఖలో 10 వేల ఉద్యోగాలు కల్పించే డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేస్తామని టీసీఎస్ ముందుకొచ్చింది. అదేవిధంగా అదానీ డేటా సెంటర్, గూగుల్ సెంటర్ ఇలా ప్రతిష్ఠాత్మక సంస్థలు విశాఖ నుంచి కార్యకలాపాలకు రెడీగా ఉండటంతో ఈ భవనాన్ని ఎవరికి కేటాయిస్తారన్న ఆసక్తి ఉత్కంఠకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి వచ్చిన వెంటనే ఈ ఐకానిక్ భవనంపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.