విశాఖ ఎమ్మెల్సీ పోరు : జగన్ ఫోకస్... కూటమి సీరియస్ !
రెండు నెలల క్రితం తమకు లభించిన అసాధారణమైన మెజారిటీని ఈసారి కూడా కొనసాగించాలన్నది టీడీపీ కూటమి పట్టుదల.
By: Tupaki Desk | 7 Aug 2024 11:30 AM GMTవిశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ నెల 30న పోలింగ్ జరిగే ఈ ఎమ్మెల్సీ సీటుని కైవశం చేసుకోవడం అధికార టీడీపీ కూటమి, విపక్ష వైసీపీకి సవాల్ గా మారింది. రెండు నెలల క్రితం తమకు లభించిన అసాధారణమైన మెజారిటీని ఈసారి కూడా కొనసాగించాలన్నది టీడీపీ కూటమి పట్టుదల.
వైసీపీ అయితే విశాఖలో పూర్తిగా పోగొట్టుకుంది. రాజకీయంగా పాతాళానికి చేరింది. దాంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటాలని చూస్తోంది. దాంతో పాటు వైసీపీకి ఈ సీటు ప్రతిష్టాత్మకంగా ఉంది. మొత్తం ఎమ్మెల్సీ ఓట్లు 838 ఉంటే అందులో 615 దాకా వైసీపీకే ఓట్లు ఉన్నాయి. 223 దాకా ఓట్లు ఉన్న టీడీపీ పోటీ పడి గెలుచుకుంటే ఇక పరువు ఏమి కావాలి అన్నది వైసీపీకి పట్టుకుంది.
మరో వైపు చూస్తే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను నిలబెట్టింది. ఆయనకు ధీటుగా టీడీపీ కూటమి కూడా తన అభ్యర్ధిని డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. అనధికార వార్తల ప్రకారం చూస్తే అనకాపల్లి మాజీ ఎమ్మెల్సీ పీలా గోవింద సత్యనారాయణకే చాన్స్ అని అంటున్నారు. ఆయన 2014 నుంచి 2019 దాకా అయిదేళ్ళ పాటు అనకాపల్లి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 2019లో ఓటమి పాలు అయ్యారు. 2024లో జనసేన కోసం సీటు త్యాగం చేశారు.
బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన పీలాకు అంగబలం అర్ధ బలం సంపూర్ణంగా ఉన్నాయి. ఎమ్మెల్సీ సీటు గెలవాలంటే ఇవి చాలా అవసరం. మరో వైపు చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ సీటుని ఎలాగైనా గెలుచుకోవాలని ఒక స్ట్రాంగ్ టీం ని రెడీ చేశారు.మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ లతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కి ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు.
వైసీపీ వైపు చూస్తే మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, అంబటి రాంబాబులను రంగంలోకి దింపుతున్నారు. బుధవారం తాడేపల్లి లోని తన క్యాంప్ ఆఫీసులో జగన్ అరకు పాడేరులకు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో కీలక సమావేశం నిర్వహించారు.
మొత్తం ఆరు వందలకు పైగా ఎంపీటీసీలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో వైసీపీకి అత్యధికంగా అరకు, పాడేరులలో గెలిచిన వారు ఉన్నారు. దాంతో మొదట వారితోనే సమావేశాన్ని జగన్ నిర్వహించారు. అరకు పాడేరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి చెందిన వారే కావడంతో పాటు అరకు ఎంపీ కూడా వైసీపీ వారే అవడంతో పార్టీకి చెందిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలను కాపాడుకోవడం తో పాటు ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్న దాని మీద జగన్ దిశా నిర్దేశం చేశారు.
విశాఖ రూరల్ జిల్లాతో పాటు విశాఖ సిటీలోని కార్పోరేటర్లతో జగన్ గురువారం సమావేశం నిర్వహించనున్నారు. ఇక క్యాంప్ రాజకీయాలు కూడా మొదలవుతున్నాయి. టీడీపీ వైసీపీ రెండూ స్థానిక ప్రజా ప్రతినిధులతో క్యాంపులను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి.
దాంతో తన బలం ఎక్కడా చెక్కుచెదరకుండా ఉండేందుకు రెండు పార్టీలు స్థానిక ప్రజా ప్రనిధులను కాపాడుకోవడం ఒక్కటే మార్గమని చూస్తున్నాయి. మొత్తం మీద చూస్తే జగన్ పూర్తిగా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక మీద ఫోకస్ పెట్టారు. ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అని ఆయన భావిస్తున్నారు. అదే టైం లో టీడీపీ కూటమి కూడా సీరియస్ గానే ఉంది. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ మినీ రాజకీయ కురుక్షేత్రానికి రంగం సిద్ధం అయింది. దానికి విశాఖ వేదికగా మారింది.