Begin typing your search above and press return to search.

విశాఖ ఎంపీ సీటు హాట్ కేక్ గా ...!

ఆ ప్రభావంతో విశాఖ సిటీలోని నాలుగు సీట్లతో పాటు ఎంపీ సీటు కూడా గెలుచుకోవచ్చు అన్నది వైసీపీ ఆలోచన

By:  Tupaki Desk   |   24 Aug 2023 1:30 PM GMT
విశాఖ ఎంపీ సీటు హాట్ కేక్ గా ...!
X

విశాఖ ఎంపీ సీటు హాట్ కేక్ గా మారిందా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఏపీలో ఉన్న అన్ని పార్టీలు విశాఖ మీదనే ప్రత్యేక దృష్టి పెట్టేశాయి. విశాఖ ఎంపీ సీటు గెలుచుకుంటే మొత్తం ఉత్తరాంధ్రానే దాని ప్రభావం పడుతుంది అన్న లెక్కలేసుకుని మరీ రంగంలోకి దిగిపోతున్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ కూడా మరోమారు విశాఖ జిల్లాను ఒడిసిపట్టడమే.

ఇక 2014లో విశాఖలో మూడంటే మూడు సీట్లు మాత్రమే గెలుచుకున్న వైసీపీ 2019 నాటికి ఏకంగా 11 సీట్లను గెలుచుకునే స్థాయికి ఎదిగింది. అయితే వైసీపీకి పెద్ద లోటు ఏంటి అంటే విశాఖ పరిధిలో ఉన్న నాలుగు సీట్లను గెలుచుకోకపోవడం. దీని కోసం వైసీపీ భారీ ప్లాన్ వేస్తోంది

ముఖ్యమంత్రి జగన్ ఏకంగా విశాఖకు షిఫ్ట్ అవుతున్నారు. ఆ ప్రభావంతో విశాఖ సిటీలోని నాలుగు సీట్లతో పాటు ఎంపీ సీటు కూడా గెలుచుకోవచ్చు అన్నది వైసీపీ ఆలోచన. విశాఖ ఎంపీ సీటు కోసం వైసీపీ సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను పక్కన పెట్టి బీసీ అభ్యర్ధిని బరిలోకి దించనుంది అని అంటున్నారు

విశాఖ సిటీ పరిధిలో యాదవులు ఎక్కువగా ఉన్నారు. దాంతో ఎమ్మెల్సీగా ఉన్న వంశీక్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ ని విశాఖ ఎంపీగా పోటీ చేయించాలని చూస్తోంది. ఆయన అయితే కరెక్ట్ అభ్యర్ధి అని భావిస్తోంది. యాదవ కమ్యూనిటీ పెద్ద ఎత్తున టర్న్ అవుతుందని కూడా అంచనా వేస్తోంది.

మిగిలిన పార్టీలు అగ్ర వర్ణాలకు టికెట్ ఇచ్చినా తమకే ప్లస్ అవుతుంది అన్నది వైసీపీ ఆలోచన. ఆ విధంగా విశాఖ ఎంపీ సీటు మీద వైసీపీ టార్గెట్ చేసింది. ఇక టీడీపీ విషయానికి వస్తే బాలయ్య చిన్నల్లుడు విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైం విశాఖ నుంచి పోటీ చేసి కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలు అయ్యారు.

దాంతో ఈసారి కచ్చితంగా గెలిచే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. బీజేపీ నుంచి చూస్తే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటు పురంధేశ్వరి రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. ఆమె 2009లో కాంగ్రెస్ తరఫున విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. ఈసారి కూడా పోటీకి ఆమె సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

ఇదే సీటు మీద బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కన్ను వేశారు అని అంటున్నారు. ఆయన రెండేళ్ళ నుంచి విశాఖలోనే ఉంటున్నారు. ఆయన బీజేపీలోని హై లెవెల్ నాయకులతో పరిచయాలను ఉపయోగించుకుని విశాఖ సీటు నుంచి పోటీ పడాలని చూస్తున్నారు.

జనసేన నుంచి కూడా విశాఖ ఎంపీ అభ్యర్థి ఉంటారని అంటున్నారు. విశాఖలో జనసేన 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే రెండు లక్షల ఎనభై వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. దాంతో ఈసారి టీడీపీ పొత్తు ఉన్నా కూడా విశాఖ ఎంపీ సీటుని వదులుకోరాదని జనసేన భావిస్తోంది. ఇటీవల గాజువాకలో పర్యటించిన పవన్ కళ్యాణ్ జనసేన గాజువాక నుంచి అభ్యర్థిని నిలబెడుతుందని పేర్కొన్నారు.

విశాఖ ఎంపీ సీటు గెలుపులో గాజువాక కీలకమైన పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ ముందస్తుగా గాజువాక నుంచి పోటీకి జనసేన తరఫున జెండా పాతేశారు అని అంటున్నారు. ఇక 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈసారి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చూస్తున్నారు.

వీరితో పాటు ఇంకా చాలా మంది విశాఖ ఎంపీగా పోటీకి రెడీ అవుతున్నారు. సౌతిండియాలో విశాఖకు ఉన్న వాల్యూ ప్రతిష్ట దృష్ట్యా విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని చాలా మంది భావిస్తున్నారు. ఇంతమంది పోటీకి రెడీ అయితే విశాఖ జనాలు ఎవరిని గెలిపిస్తారు అన్నది చూడాలి. విశాఖ మినీ ఇండియాగా ఉంది. కాస్మోపాలిటిన్ సిటీ కచ్లర్ ఉంది. దాంతో ఎవరైనా విశాఖ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి విశాఖ వాసుల ఓటు ఎవరికో అన్నదే ఇపుడు ఇంటెరెస్టింగ్ పాయింట్.