Begin typing your search above and press return to search.

విశాఖలో బీజేపీ వర్సెస్ వైసీపీ...!?

విశాఖ ఎంపీ సీటు బీజేపీ కోరుతోంది. ఈ విషయంలో గట్టిగా పట్టుపడుతోంది. టీడీపీ మాత్రం ససేమిరా అంటోందని టాక్

By:  Tupaki Desk   |   11 March 2024 5:45 PM GMT
విశాఖలో బీజేపీ వర్సెస్ వైసీపీ...!?
X

విశాఖ ఎంపీ సీటు బీజేపీ కోరుతోంది. ఈ విషయంలో గట్టిగా పట్టుపడుతోంది. టీడీపీ మాత్రం ససేమిరా అంటోందని టాక్. దాంతో సీట్ల పంచాయతీ ఒక కొలిక్కి రావడంలేదు అని అంటున్నారు. విశాఖ ఎంపీ సీటు బీజేపీ కోరుకోవడం వెనక అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు.

విశాఖలో బీజేపీకి కొంత బలం ఉంది. 2014లో ఇదే ఎంపీ సీటుని ఆ పార్టీ గెలుచుకుంది. దాంతో పాటుగా విశాఖ నార్త్ అసెంబ్లీ సీటుని గెలుచుకుంది. గతంలో విశాఖ వన్ స్థానం నుంచి కూడా బీజేపీ గెలిచింది. ఇక పాత రోజులకు వెళ్తే విశాఖ కార్పోరేషన్ తొలి మేయర్ కూడా బీజేపీ వారే.

దాంతో దశాబ్దాలుగా విశాఖలో తమకు కొంత బలం ఉందని అందుకే ఎంపీ సీటు ఇవ్వాల్సిందే అని బీజేపీ పెద్దలు వాదిస్తున్నారు విశాఖ ఎంపీ సీటు పూర్తిగా అర్బన్ ఓటర్లతోనే ఉంటుంది. గతంలో టీడీపీకి రూరల్ సెక్టార్ లో బాగా పట్టున్న వేళ విశాఖ ఎంపీ సీటు కాంగ్రెస్ గెలుచుకుంటూ ఉండేది.

ఇపుడు టీడీపీకి అర్బన్ ఓటర్లలో బలం పెరిగింది. దాంతో విశాఖ ఎంపీ సీటు నుంచి గెలవాలని చూస్తోంది. సినీ నటుడు బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ ఇప్పటికే టీడీపీ తరఫున అభ్యర్ధిగా ఉన్నారు. బీజేపీ విషయానికి వస్తే కేంద్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితుడు అయిన జీవీఎల్ నరసింహారావు కోసం ఈ సీటుని కోరుతోంది అని అంటున్నారు.

ఆయన మూడేళ్ళుగా విశాఖలోనే నివాసం ఉంటూ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన సామాజిక వర్గం ఓట్లు కూడా విశాఖ ఎంపీ పరిధిలో గణనీయంగా ఉన్నాయి. విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాది వారి జనాభా కూడా చెప్పుకోదగిన మోతాదులో ఉంటుంది అని అంటున్నారు.

మోడీ ఇమేజ్ ఈసారి మరో విధంగా ఉండబోతోందని, ఆయన హవాలో విశాఖ ఎంపీ సీటు గెలుచుకోవడం ఖాయమని బీజేపీ ధీమాగా ఉంది. టీడీపీ మాత్రం అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తామని అంటోంది. అది పూర్తిగా గ్రామీణ వాతావరణంతో కూడుకున్న సీటు.

అక్కడ బీజేపీకి బలం కొంతవరకే ఉంది. ఆ సీటుని ఇస్తే మాత్రం తమకు ఇబ్బంది అవుతుంది అని కమలనాధులు భావిస్తున్నారు. ఆరు నూరు అయినా విశాఖ ఎంపీ సీటే కావాలని వారు పట్టుబడుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో టీడీపీ నిర్ణయం ఎలా ఉంటుంది అన్నదే చర్చగా ఉంది.

బీజేపీ మరీ కోరితే కనుక టీడీపీ ఈ సీటుని త్యాగం చేసేందుకే సిద్ధపడుతుందని అంటున్నారు. అనకాపల్లి నుంచి టీడీపీ పోటీ చేస్తే విశాఖ ఎంపీ సీటు నుంచి బీజేపీ పోటీ పడుతుంది అని అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే చాలా కాలం క్రిత్రమే అభ్యర్ధిని సెలెక్ట్ చేసి పెట్టుకుంది.

మంత్రి బొత్స సతీమణి బొత్స ఝానీ ఆ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఆమె పక్కా లోకల్ అని బీసీ మహిళ అని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇక బొత్సకు విశాఖలో వ్యాపారాలు చాలానే ఉన్నాయి. ఆయన సామాజిక వర్గం కూడా ఎక్కువగానే ఉంది. దాంతో బొత్స ఝాన్సీ తో ప్రత్యర్ధికి టఫ్ గానే పోటీ ఉంటుందని లెక్క వేస్తున్నారు

వైసీపీతో బీజేపీ అభ్యర్ధి పోటీ పడితే నెగ్గుకుని రాగలరా అన్నది కూడా ఉంది. టీడీపీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే మాత్రం బీజేపీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రీవేటీకరణ అంశం ఈసారి బీజేపీకి ఇబ్బందికరం అని వైసీపీ అంచనా కడుతోంది. మొత్తానికి చూస్తే విశాఖలో బీజేపీ వర్సెస్ వైసీపీగా ఎంపీ సీటులో పోరుకు సూచనలు కనిపిస్తున్నాయి.