విశాఖ సిటీలో వైసీపీ ఖాతా ?
అయితే ఈసారి విశాఖ సిటీలో ఉన్న నాలుగు సీట్లలో కనీసంగా రెండు వైసీపీ గెలుచుకుంటుందని అంచనాలు అయితే ఉన్నాయి
By: Tupaki Desk | 16 May 2024 11:30 PM GMTవిశాఖ సిటీ టీడీపీకి కంచుకోట. ఇది గతంలోనూ అనేక సార్లు రుజువు అయింది. వైఎస్సార్ వేవ్ లో కూడా విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని టీడీపీ గాజువాకను ప్రజారాజ్యం పార్టీలు 2009లో కైవశం చేసుకున్నాయి. ఇక 2014, 2019లలో టీడీపీకి విశాఖ సిటీలోని నాలుగు సీట్లను జనాలు కట్టబెట్టారు. 2019లో ఉత్తరాంధ్రా అంతటా బలంగా వీచిన వైసీపీ వేవ్ లో సైతం విశాఖ మాత్రం పసుపు జెండానే ఎగరేసింది.
అయితే ఈసారి విశాఖ సిటీలో ఉన్న నాలుగు సీట్లలో కనీసంగా రెండు వైసీపీ గెలుచుకుంటుందని అంచనాలు అయితే ఉన్నాయి. వైసీపీ కూడా ఆ దిశగా ధీమాగా ఉంది. అదే సమయంలో టీడీపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గండి బాబ్జీ సైతం దీని మీద ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేయడంతో విశాఖ సిటీలో వైసీపీ ఎంట్రీ ఉంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది.
విశాఖలో ఒకటి రెండు సీట్లు తగ్గవచ్చు అని అన్యాపదేశంగా గండి బాబ్జీఎ చెప్పినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. మొత్తంగా విశాఖ జిల్లా పోలింగ్ సరళిని పరిశీలించిన మీదట సిటీలో ఒకటి రెండు సీట్లు కోల్పోవచ్చు అన్నది టీడీపీ నేతల అంతర్గత చర్చలలో కూడా వచ్చింది అని అంటున్నారు.
ఆ రెండు సీట్లు ఏమిటి అంటే ఒకటి విశాఖ సౌత్, రెండు విశాఖ నార్త్ అని అంటున్నారు. విశాఖ సౌత్ లో ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ 2019 తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి జంప్ చేశారు. ఆయనకే 2024లో వైసీపీ టికెట్ ఇచ్చింది. ఇక టీడీపీకి బలమైన ఈ సీటుని జనసేనకు కేటాయించారు. వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన వంశీ సౌత్ నుంచి పోటీ చేశారు.
అయితే ఆయనకు పూర్తి స్థాయిలో మిత్ర పక్షాల నుంచి సహాయ సహకారాలు దక్కలేదని అంటున్నారు. దాంతో పాటు లోకల్ నాన్ లోకల్ అన్న చర్చను మొదటి నుంచి లేవదీశారు అని కూడా చెబుతున్నారు. దాంతో ఈ సీటులో కొంత మొగ్గు అయితే వైసీపీకి ఉందని పోలింగ్ సరళిని చూసిన తరువాత ఒక నిర్ణయానికి అటు వైసీపీ వచ్చింది. టీడీపీలో కూడా అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక విశాఖ నార్త్ సీటుని తీసుకుంటే ఇది కూడా వైసీపీ ఖాతాలో పడుతుందని అంటున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లింది. 2014లో బీజేపీ నుంచి గెలిచిన విష్ణు కుమార్ రాజు ఈసారి కూడా పోటీ చేశారు. అయితే వైసీపీ నుంచి 2019లో పోటీ చేసిన కేకే రాజు మళ్లీ బరిలో ఉన్నారు. ఆయన గతంలో జస్ట్ రెండు వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలు అయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనే అనధికార ఎమ్మెల్యేగా అయిదేళ్ళూ వ్యవహరించారు.
దాంతో పాటు ఆయన ఓడిపోయారు అన్న సానుభూతి ఉండడంతో పాటు వైసీపీ అక్కడ కసిగా పనిచేసింది అని అంటున్నారు. దాంతో ఇక్కడ వైసీపీకి కొంత మొగ్గు ఉందని చెబుతున్నారు. దీంతో పాటు బీజేపీ అభ్యర్ధికి మిత్రపక్షాల నుంచి సహాయం అనుకున్న స్థాయిలో లేకపోవడం జేడీ లక్ష్మీనారాయణ ఉత్తరం నుంచి పోటీ చేసి బలమైన ఒక సామాజికవర్గం ఓట్లను కొంత వరకూ తన వైపు తిప్పుకోవడం వంటి పరిణామాల నేపధ్యం కూడా కూటమి విజయానికి దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.
మొత్తం మీద చూతే విశాఖలో ఉన్న నాలుగు దిక్కులలో రెండు దిక్కులు వైసీపీ వైపు చూస్తున్నాయని అంటున్నారు. ఇదే కనుక జరిగితే సిటీలో ఫస్ట్ టైం వైసీపీ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. టీడీపీలోనూ ఈ రెండు సీట్ల మీదనే చర్చ సాగుతోంది అని అంటున్నారు. చూడాలి మరి అసలు ఫలితాలు ఏమి చెబుతాయో