విశాఖ తూర్పు వైసీపీలో మరో రెబెల్...!?
ఇక ఇపుడు మరో అసమ్మతి అక్కడ మొగ్గ తొడిగి బయటకు వస్తోంది. విఎమ్మార్డీయే చైర్ పర్సన్ గా ఉన్న అక్రమాని విజయనిర్మల వైసీపీ అధినాయకత్వం వైఖరి మీద గుర్రుగా ఉన్నారు.
By: Tupaki Desk | 21 Jan 2024 3:55 AM GMTవిశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ రగులుతూనే ఉంది. అక్కడ ఇంచార్జిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను చాలా కాలం క్రితమే వైసీపీ అధినాయకత్వం నియమించింది. దాంతో అలిగి చాలా కాలం పార్టీకి దూరంగా ఉన్న ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఇటీవలనే పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు.
ఇక ఇపుడు మరో అసమ్మతి అక్కడ మొగ్గ తొడిగి బయటకు వస్తోంది. విఎమ్మార్డీయే చైర్ పర్సన్ గా ఉన్న అక్రమాని విజయనిర్మల వైసీపీ అధినాయకత్వం వైఖరి మీద గుర్రుగా ఉన్నారు. ఆమె 2019 ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి ఓడారు. అప్పటి నుంచి ఆమె తూర్పులో పార్టీకి ఇంచార్జిగా ఉన్నారు. 2024లో ఆమె పోటీ చేస్తారు అని అనుకుంటున్న తరుణంలో ఎంవీవీ రంగంలోకి వచ్చారు. ఆయన ఇంచార్జి పదవిని అందుకున్నారు.
ఇక 2024లో అయనే పోటీ చేస్తారు అని అంతా అంటున్నారు. దాంతో అక్రమాని విజయనిర్మల రూట్ ఏంటి అన్నది చర్చగా ఉంది. ఇదిలా ఉంటే వైసీపీ అధినాయకత్వం తనకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని తన అనుచరులతో విజయనిర్మల అంటున్నారు. చివరి నిముషంలో అయినా విశాఖ తూర్పు సీటు తనకే ఇస్తుందని ఆమె ఆశాభావంగా ఉన్నారుట.
ఒకవేళ అదే జరగకపోతే మాత్రం ఆమె పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆమె గతంలో భీమునిపట్నం చైర్ పర్సన్ గా పనిచేశారు. విద్యావంతురాలిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా ఉన్నారు. అయితే ఆమె ఇంచార్జిగా ఉన్నా కూడా నాలుగేళ్లలో వైసీపీ విశాఖ తూర్పులో గ్రాఫ్ పెంచుకోలేదని భావించే పార్టీ ఎంవీవీకి చాన్స్ ఇచ్చింది. ఇపుడు ఆమెకు సీటు ఇస్తారా అంటే డౌటే అంటున్నారు.
మరి అక్రమాని వర్గం ఏమి చేస్తుంది అన్నది సందేహంగా ఉంది. అయితే ఆమె సరైన సమయం చూసుకుని పార్టీని వీడి షాక్ ఇచ్చేందుకే రెడీ అన్న సంకేతాలు అయితే ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే విశాఖ తూర్పు వైసీపీలో మూడు ముక్కలాట అలాగే సాగుతోంది అని అంటున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఓసీ అయిన ఎంవీవీని ఎలా తీసుకుని వస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిని కనుక పరిష్కరించకపోతే మరోమారు ఇక్కడ టీడీపీకే గెలిచే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.