విశాఖ క్యాపిటల్ : జగన్ ప్లాన్ సక్సెస్ రేటు ఎంత...?
సీఎం క్యాంప్ ఆఫీసును విశాఖలో ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచే పాలన సాగుతుందని వైసీపీ వర్గాలు ప్రకటించాయి.
By: Tupaki Desk | 8 Oct 2023 3:20 AM GMTవిశాఖ క్యాపిటల్ అని మూడేళ్ళ క్రితం ఒక శీతాకాలం నిండు అసెంబ్లీలో జగన్ సంచలన ప్రకటన చేశారు. ఆ మీదట 2020 మొదట్లో హడావుడిగా చట్టం చేశారు. అయితే అది న్యాయ సమీక్షకు నిలబడలేదు. ఏపీ హై కోర్టు లో విచారణకు ముందే తాము చేసిన మూడు రాజధానుల చట్టాన్ని వైసీపీ విరమించుకుంది. ఇదిలా ఉంటే అమరావతే రాజధాని అంటూ హై కోర్టు తీర్పు ఇచ్చింది.
దానిని వైసీపీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అది ఈ డిసెంబర్ నుంచి విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే టెక్నికల్ గ్రౌండ్స్ ను ఆధారం చేసుకుని విశాఖలో మకాం అంటున్నారు జగన్. విజయదశమి నుంచి ఆయన విశాఖ నుచ్నే పాలన సాగించాలని భావిస్తున్నారు.
సీఎం క్యాంప్ ఆఫీసును విశాఖలో ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచే పాలన సాగుతుందని వైసీపీ వర్గాలు ప్రకటించాయి. విశాఖ రుషికొండ మీద ఉన్న భవనాలలో ఒక దాన్ని సీఎం నివాసం, అలాగే మరో దానిని క్యాంప్ ఆఫీసులుగా మార్చి ఈ నెల 23 నుంచి జగన్ విశాఖ వాసిగా మారిపోతారని అంటున్నారు.
ఆరు నెలల నుంచి ఈ విషయం వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అలాగే విజయదశమి నుంచి విశాఖలో పాలన అని మంత్రుల సమావేశంలో జగన్ ప్రకటించారు. కానీ విశాఖ జనాలలో ఎలాంటి రియాక్షన్ రలేదు. అదే టైం లో విపక్షాలు అయితే విశాఖ లో పాలన కాదు, అరాచకం అని మండిపడుతున్నాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే జగన్ విశాఖ రావడం వల్ల ఒరిగేది లేదని హాట్ కామెంట్స్ చేశారు.
ఈ పరిణామాలు ఇలా ఉంటే విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అలాగే అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో 28 అసెంబ్లీ నాలుగు ఎంపీ సీట్లను 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తోంది. ఈసారి వైసీపీ విజయానికి ఉత్తర కోస్తా జిల్లాలు కీలకం అని భావిస్తోంది ఆ పార్టీ అధినాయకత్వం.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు క్రిష్ణా గుంటూరులలో ఉన్న 67 అసెంబ్లీ సీట్లలో ఈసారి కొన్ని సీట్లు తగ్గుతాయని వైసీపీ భావిస్తోంది అంటున్నారు. జనసేన టీడీపీ పొత్తు ప్రభావంతో వైసీపీకి గతంలో వచ్చిన సీట్లు ఈసారి కొన్ని తగ్గుతాయని విశ్లేషణలు ఉన్నాయి. దాంతో మళ్లీ గెలవాలని అంటే మాత్రం ఉత్తర కోస్తా నుంచే రాజకీయ దూకుడు చేయాలని వైసీపీ తలపొస్తోంది.
రాయలసీమలో మొత్తం ఉమ్మడి నాలుగు జిల్లాలలో 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2019లో 49 సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఈసారి అంత హవా సాగదని, టీడీపీ జనసేన కూటమికి పది నుంచి పన్నెడు దాకా సీట్లు రావచ్చు అంటున్నారు. అంటే రాయలసీమలో నలభై సీట్లకు తగ్గకుండా చూసుకోవాలని వైసీపీ ఆరాటపడుతోంది.అలాగే నెల్లూరులోని పదికి పది గతసారి గెలుచుకుంది. సీసారి కొన్ని తగ్గినా మెజారిటీ గెలుచుకోవాలని చూస్తోంది.
పన్నెండు సీట్లు ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా సగానికి పైగా సీట్లు వస్తే మొత్తంగా ఒక అరవై సీట్లు గ్రేటర్ రాయలసీమ నుంచి వస్తాయని అంచనా కడుతోంది. ఇక 101 సీట్లు ఉన్న కోస్తా జిల్లాలఓ యాభైకి పైగా సీట్లను రాబడితే 110 నుంచి 120 సీట్లతో మళ్లీ సర్కార్ ఏర్పాటు చేయవచ్చు అన్నది వైసీపీ ప్లాన్. అందుకే ఉత్తర కోస్తాలో రాజధాని అన్నట్లుగా విశాఖకు జగన్ మకాం అంటున్నారు.
అయితే ఇది ఎంతవరకూ ఉత్తర కోస్తా తో పాటు కోస్తా జిల్లాల మీద ప్రభావం చూపుతుంది అన్నది కూడా చర్చగా ఉంది. అదే సమయంలో రాయలసీమ వాసులలో రాజధాని డిమాండ్ ఉంది. అక్కడ హై కోర్టు లేకపోయిన బెంచ్ అయినా పెట్టి ఉంటే కొంత ఓదార్పు దక్కేది. అక్కడ ఏదీ లేకుండా విశాఖ నుంచి పాలన మొదలెడితే ఉత్తరకోస్తా సంగతి ఏమో కానీ రాయలసీమలో వ్యతిరేకత పెరిగితే ఇబ్బందులు వస్తాయా అన్న చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.