విశాఖ డ్రగ్స్ కేసు... "సింగం" సినిమా తరహాలో సీబీఐ నెక్స్ట్ స్టెప్!!
అవును... అత్యంత సంచలన విషయంగా మారిన విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసిందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 27 March 2024 1:11 PM GMTసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనూహ్యంగా విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఏపీలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ముందుగా టీడీపీ ఆరోపణలు గుప్పించగా.. మరుసటిరోజు ఉదయం వైసీపీ రివర్స్ అటాక్ ఇచ్చింది! ఆ సంగతి అలా ఉంటే... ఈ వ్యవహారంపై సీబీఐ నెక్స్ట్ స్టెప్ తీసుకుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... బ్రెజిల్ కు సీబీఐ స్పెషల్ టీం వెళ్లనున్నట్లు తెలుస్తోంది!
అవును... అత్యంత సంచలన విషయంగా మారిన విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఈ వ్యవహారం వెనుక ఉన్న అంతర్జాతీయ లింకులపై ఆరా తీస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విచారణ బృందాలు బ్రెజిల్ వెళ్లనున్నాయని... ఫలితంగా... డ్రై ఈస్ట్ సప్లయ్ చేసిన బ్రెజిల్ సంస్థలో కీలక ఆధారాలు లభిస్తాయని సీబీఐ అంచనా వేస్తోందట.
ఈ మేరకు ఇప్పటికే సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్స్ డేటా, ఈ-మెయిల్స్ తో పాటు వాట్సప్ చాట్ లను పరిశీలించి, కొంత మేర సమాచారం సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో... నార్కోటిక్ పరీక్షల నివేదికల కోసం దర్యాప్తూ బృందం ఎదురుచూస్తోందని అంటున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికే మెటీరియల్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లను సీబీఐ సేకరించిందని.. సంస్థ ప్రతినిధుల కదలికలపై నిఘా పెట్టిందని సమాచారం!
కాగా... ఈ విషయంలో సంధ్యా అక్వా సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ... తమ సంస్థ తీసుకొచ్చిన డ్రై ఈస్ట్ లో డ్రగ్స్ ఎలా వచ్చాయ్యో తమకు తెలియదని చెబుతోన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల మరికొన్ని బ్యాగ్ లను పరీక్షించగా.. వాటిల్లోని సుమారు 70శాతం డ్రై ఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు.
ఇదే క్రమంలో... ఇప్పటికే.. బ్రెజిల్ నుంచి ఫీడ్ ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడ నుంచే తెప్పించుకోవడానికి గల ప్రత్యేక కారణాలు.. విశాఖ పోర్టునే ఎంచుకోవడానికి గల కారణాలు వంటి ప్రశ్నలతో పాటు.. నిర్ణీత వ్యవధిలో వీటిని ఎలా విక్రయిస్తారు అనే మొదలైన ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది.