Begin typing your search above and press return to search.

'విశాఖ'.. ఎందుకీ కష్టం?

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ నుంచి నిత్యం లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో ఉండటం లేదంటున్నారు.

By:  Tupaki Desk   |   15 March 2024 5:09 AM GMT
విశాఖ.. ఎందుకీ కష్టం?
X

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నానికి పేరుంది. అంతేనా రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం కూడా విశాఖపట్నమే. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖను కార్వనిర్వాహక రాజధానిగా కూడా ప్రకటించింది. అయితే ఇన్ని ప్రత్యేకతలున్నా రైలు ప్రయాణికులకు మాత్రం కష్టాలు తప్పడం లేదని అంటున్నారు.

తూర్పు, దక్షిణ భారత్‌ లను అనుసంధానించే ప్రధాన స్టేషన్లలో ఒకటిగా విశాఖపట్నం ఉంది. అటు తూర్పు భారత్‌ లోని అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశాల నుంచి దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు వచ్చే రైళ్లు విశాఖపట్నం మీదుగానే రాకపోకలు సాగిస్తాయి. అలాగే దక్షిణ భారతదేశం నుంచి పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు విశాఖ మీదుగానే వెళ్లాల్సి ఉంది.

అయితే.. ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఇంకా సాకారం కాకపోవడంతో రైలు ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదని అంటున్నారు. విశాఖపట్నాన్ని అందుకు తగ్గట్టుగా అభివృద్ధి చేయకపోవడంతో 35 రైళ్లు విశాఖకు రాకుండా దువ్వాడ మీదుగానే వెళ్లిపోతున్నాయని చెబుతున్నారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తమకు భూమిని ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌ సభలో ఇటీవల వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు భూమి అప్పగిస్తే రైల్వే జోన్‌ ను ఏర్పాటు చేస్తామని కేంద్రం చెబుతోంది. రైల్వే జోన్‌ వస్తే రైల్వే బోర్డు కూడా ఏర్పాటవుతుంది. విశాఖ ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయి. వాటిని మన రాష్ట్ర యువత దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే జోన్‌ సాకారం కాకపోవడంతో రాష్ట్ర యువత ఇతర రాష్ట్రాల పరిధిలోని రైల్వే జోన్ల పరీక్షలు రాసుకోవాల్సి వస్తోంది.

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ నుంచి నిత్యం లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో ఉండటం లేదంటున్నారు. దీంతో సీట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.

మరోవైపు విశాఖలో రైళ్లు ఆగడానికి తగినన్ని ప్లాట్‌ పారమ్స్‌ లేవంటున్నారు. అలాగే ఏదైనా రైలు వస్తే ఇంజిన్‌ మార్చుకుని బయలుదేరడానికి 20 నిమిషాలకుపైగానే పడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారంలో 35 వరకు రైళ్లు విశాఖపట్నం రాకుండా దువ్వాడ స్టేషన్‌ మీదుగా వెళ్లిపోతున్నాయని తెలుస్తోంది.

ఈ సమస్య పరిష్కారానికి బల్బ్‌ స్టేషన్, మర్రిపాలెం స్టేషన్‌ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అయితే బల్బ్‌ స్టేషన్‌ అభివృద్ధికి విశాఖ పోర్టు భూమలు ఇవ్వడానికి అంగీకరించలేదని సమాచారం. దీంతో ఇక మర్రిపాలెం స్టేషన్‌ ఒక్కటే గతి అయ్యిందని అంటున్నారు. అయితే దీన్ని కూడా అభివృద్ధి చేయకపోవడంతో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు పరిస్థితి ఉందని చెబుతున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సాకారమై ఉంటే ఈ సమస్యలకు అడ్డుకట్ట పడేదని పేర్కొంటున్నారు.

మర్రిపాలెంలో నాలుగైదు ప్లాట్‌ ఫారాలు నిర్మిస్తే విశాఖ నుంచి బయలుదేరే రైళ్లను ఇక్కడి నుంచి పంపించవచ్చని చెబుతున్నారు. తద్వారా దువ్వాడ మీదుగా వెళ్లే రైళ్లను విశాఖకు మళ్లించవచ్చని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించి ఉంటే రైల్వే జోన్‌ సాకారమయ్యేదని వివరిస్తున్నారు.

విశాఖ రాకుండా దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న కొన్ని రైళ్లు ఇవే..

టాటానగర్‌–ఎర్నాకుళం–టాటానగర్‌ (ప్రతి రోజూ)

బెంగళూరు–హావ్‌ డా–బెంగళూరు (5రోజులు) (విజయనగరం మీదుగా) బెంగళూరు – హావ్‌ డా–హావ్‌ డా ఎక్స్‌ప్రెస్‌ (ఒకరోజు)

భువనేశ్వర్‌–చెన్నై–భువనేశ్వర్‌ ప్రత్యేక రైలు (ఒకరోజు)

హావ్‌ డా–సత్యసాయి ప్రశాంతి నిలయం–హావ్‌ డా రైలు (ఒకరోజు)

కామాఖ్య– బెంగళూరు– కామాఖ్య ప్రత్యేక రైలు (ఒకరోజు)

భువనేశ్వర్‌– తిరుపతి–భువనేశ్వర్‌ ప్రత్యేక రైలు (ఒకరోజు)