Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో... ముహూర్తం ఎప్పుడంటే...?

మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విశాల్... ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించగా నామినేషన్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Feb 2024 4:54 AM GMT
రాజకీయాల్లోకి మరో స్టార్  హీరో... ముహూర్తం ఎప్పుడంటే...?
X

వచ్చే ఎన్నికల్లో తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారేలా కనిపిస్తున్నాయి. స్టార్ హీరోలు ఈసారి రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో.. తాజాగా మరో స్టార్ హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగాణాలు మొదలయ్యాయి. అయితే.. ఇది కన్ ఫాం అని అంటున్నారు తంబీలు!


అవును... తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల రాజకీయ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు "విజయ్ పీపుల్స్ మూవ్మెంట్" స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన... ఇటీవలే సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణల్లో భారీ మార్పు తీసుకురావడం కోసం రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు! ఇందులో భాగంగా... "తమిళగ వెట్రి కజగం" అనే పార్టీని అధికారికంగా ప్రకటించారు.

ఈ సమయంలో... హీరో విశాల్‌ కూడా రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో వైఎస్సారీసీపీ నుంచి చిత్తురు జిల్లాలో విశాల్ పోటీచేసే అవకాశం ఉందని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఒకానొకసమయంలో కుప్పంలో చంద్రబాబుపైనే పోటీకి దిగబోతున్నారని ఊహాగాణాలు హల్ చల్ చేశాయి. అయితే ఏపీ రాజకీయాల్లో కాదు.. తమిళనాడులోని పొలిటికల్ ఎంట్రీకి విశాల్ రెడీ అవుతున్నారని అంటున్నారు.

మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విశాల్... ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించగా నామినేషన్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇక తన అభిమాన సంఘాన్ని "విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం" (విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి అన్ని జిల్లాల్లో ఇన్‌ ఛార్జులను నియమించారు. ఇదే క్రమంలో బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇతర ప్రాంతాలకు షూటింగ్‌ లకు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని తగిన సాయం చేస్తూ వస్తున్నారు.

అప్పటినుంచే విశాల్ పొలిటికల్ ఎంట్రీపై ఉహాగాణాలు హల్ చల్ చేశాయి. ఈ క్రమంలోనే త్వరలో "విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం" నిర్వాహకులను చెన్నైకి పిలిపించి సమాలోచన జరపనున్నట్లు తెలుస్తుంది. తన ప్రజాసంక్షేమ సంఘం నిర్వాహకులతో భేటీ అయ్యి.. చర్చలు జరిపిన అనంతరం విశాల్‌ తన రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

అయితే... విశాల్ కూడా తళపతి విజయ్ లాగానే ఈ ఏడాది జరగబోయే లోక్‌ సభ ఎన్నికలలో పోటీకి దిగారని.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఫుల్ టీంతో పక్కాగా పోటీకి ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఏది ఏమైనా 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు హీరోలు బరిలోకి దిగి ఏ మేరకు సత్తా చాటుతారనేది వేచి చూడాలి!!

కాగా... ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయం సాధించిన విశాల్... తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.