కమలం.. పుట్టి ముంచుతున్న రాజుగారు.. ఏం జరిగింది..!
ప్రధాని నరేంద్ర మోడీ సహా.. బీజేపీ పెద్దలు సైతం ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనికి కారణం.. ఆదివాసీలు, గిరిజన ఓటు బ్యాంకు ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉండడమే.
By: Tupaki Desk | 22 Jan 2025 12:30 PM GMTరాజకీయాల్లో ఎన్నికల సమయంలోనే నాయకులకు ఆవేశం ఉండాలి. ఎన్నికల తర్వాత.. అధికారం చేపట్టాక కూడా ఆవేశం, కోపం వంటివి కొనసాగిస్తే.. అది వారికి ఎలా ఉన్నా.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు మాత్రం చెరపరాని తప్పులు తీసుకువస్తుంది. ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యవహారం కూడా ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. విశాఖపట్నంలో పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోడీ సహా.. బీజేపీ పెద్దలు సైతం ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనికి కారణం.. ఆదివాసీలు, గిరిజన ఓటు బ్యాంకు ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉండడమే. కేంద్రం స్థాయిలో గిరిజనుల ఓటు బ్యాంకు కోసం.. అనేక పథకాలు తీసుకువస్తోంది. అందుకే.. మోడీ సైతం.. విశాఖనే టార్గెట్ చేసుకు ని గతంలోను, తర్వాత ఇటీవల కూడా ఇక్కడకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నీ ఆలోచించుకుని విశాఖ స్టీల్ ప్లాంట్కు 11 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని సైతం ప్రకటించారన్న చర్చ కూడా ఉంది.
ఇంతలా బీజేపీ పెద్దలు.. విశాఖ పై దృష్టి పెడితే.. విష్ణు కుమార్ మాత్రం.. తనదైన శైలిలో ఈ మొత్తాన్ని నాశనం చేస్తున్నారని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన తాజా గా విశాఖ ఉక్కు కార్మికులపై చేసిన వ్యాఖ్యలతోపాటు.. గతంలో వ్యవహరించిన తీరును కూడా వారు తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ చీఫ్ పురందేశ్వరి కూడా సీరియస్‌గానే తీసుకున్నట్టు సమాచారం. కానీ, పైకి ఏమీ అనకపోయినా.. పార్టీ పెద్దలకు నోట్ పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. విష్ణు వ్యవహార శైలితో పార్టీ నష్ట పోతుందన్నది ఆమె వాదన కూడా!!
అసలు ఏం జరిగింది..
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై విశాఖ ఉక్కు కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. అక్కడకు వెళ్లిన విష్ణు.. మీకు దురాశ ఎక్కువ. మీకు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ నచ్చకపోతే.. ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోండి! అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఈ వ్యవహారం వివాదానికి దారితీసింది. కేంద్రం తరఫున మాట్లాడడం సరైందే అయినా.. కార్మికులను ఇలా తూలనాడడం సరికాదన్నది బీజేపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.