Begin typing your search above and press return to search.

రాజు గారి వారసురాలు వచ్చేస్తున్నారా ?

ఆయన 2019లో పొత్తులు లేకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ ఏపీలో చాలా మందికి రాని ఓట్లను తెచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   8 March 2025 3:00 PM IST
రాజు గారి వారసురాలు వచ్చేస్తున్నారా ?
X

వారసత్వం అన్నది సర్వసాధారణం అయినది. అన్ని రంగాల్లో ఉంది. ప్రతిభ ఉంటే రాణించవచ్చు. ముఖ్యంగా రాజకీయాల్లో వారసత్వం అన్నది చాలా సందర్భాలలో సక్సెస్ అయింది. దాంతో రాజకీయ నేతలు తమ తరువాత వారిని తీసుకుని వస్తున్నారు.

విషయానికి వస్తే బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన విష్ణు కుమార్ రాజు గురించి అందరికీ తెలిసిందే. ఆయన రెండు సార్లు ఉత్తరం నుంచి గెలిచారు. స్థానికంగా తనకంటూ పట్టు సాధించారు. జనంతో మమేకం కావడం ద్వారా తనదైన ఓటు బ్యాంక్ ని క్రియేట్ చేసుకున్నారు.

ఆయన 2019లో పొత్తులు లేకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ ఏపీలో చాలా మందికి రాని ఓట్లను తెచ్చుకున్నారు. దాదాపుగా ఇరవై వేలకు తగ్గకుండా ఓట్లు రాజుకు వచ్చాయీ అంటే ఆయనకు స్థానికంగా జనంలో ఉన్న పలుకుబడికి అది నిదర్శనం అని అంటారు.

ఇదిలా ఉంటే విష్ణు కుమార్ రాజు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ నేతగా ఉన్నారు. దాంతో టీడీపీ కూటమిలో తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. 2014లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు ఉంటేనే అందులో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఈసారి ఎనిమిది మంది గెలిచారు. కనీసం ఇద్దరికి అయినా దక్కాలన్నది రాజు గారి మాటగా ఉంది.

కానీ జనసేనకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. నాగబాబుతో కలిపితే నలుగురు అవుతారు. బీజేపీ విషయానికి వస్తే మాత్రం ఒకే మంత్రితో సరిపెట్టారు అన్న అసంతృప్తి చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యం ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో రాజు గారు పోటీ చేస్తారా లేదా అన్నది చర్చగా ఉంది.

ఆయనకి పార్టీ మూడు సార్లు చాన్స్ ఇస్తే రెండు సార్లు గెలిచారు. సక్సెస్ ఫుల్ గానే తన పొలిటికల్ కెరీర్ ని కొనసాగించారు. దాంతో 2029 ఎన్నికల్లో ఇదే కూటమితో పొత్తులతో వెళ్తామని మూడు పార్టీలు చెబుతున్నందువల్ల విశాఖ ఉత్తరం సీటు పొత్తులలో భాగంగా బీజేపీకే మళ్ళీ దక్కవచ్చు అని అంటున్నారు.

అయితే రాజు గారు పోటీ చేయకపోతే ఎవరు అంటే ఆయన కుమార్తె అని అంటున్నారు. ఆమెకు రాజకీయ ఆసక్తి ఉందని చెబుతున్నారు. తాజాగా విశాఖకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు తన కుమార్తెని తీసుకుని వెళ్ళి మరీ రాజు పరిచయం చేశారు.

దీంతో వారసురాలు రంగ ప్రవేశం చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. అదే కనుక జరిగితే బీజేపీ రాజు వారసురాలు రాజకీయ అరంగేట్రానికి ఎంతో దూరం లేదని అంటున్నారు. అయితే ఇది మర్యాదపూర్వకమైన భేటీగా చెబుతున్నా కుమార్తెను వెంటబెట్టుకుని వెళ్ళి మరీ కలవడంతోనే రాజకీయ చర్చ సాగుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో.