Begin typing your search above and press return to search.

చత్తీస్ గఢ్ కొత్త సీఎంగా విష్ణు దేవ్ సాయి !

భారతీయ జనతా పార్టీ దాదాపు వారం తరువాత సుదీర్ఘంగా ఆలోచన చేసి మరీ చత్తీస్ గఢ్ కి కొత్త సీఎం గా విష్ణు దేవ్ సాయిని ఎంపిక చేసింది.

By:  Tupaki Desk   |   10 Dec 2023 5:46 PM GMT
చత్తీస్ గఢ్ కొత్త సీఎంగా విష్ణు దేవ్ సాయి  !
X

భారతీయ జనతా పార్టీ దాదాపు వారం తరువాత సుదీర్ఘంగా ఆలోచన చేసి మరీ చత్తీస్ గఢ్ కి కొత్త సీఎం గా విష్ణు దేవ్ సాయిని ఎంపిక చేసింది. ఆయన బీజేపీకి వీర విధేయుడు. అంతే కాదు ఒక సాధారణ సర్పంచ్ నుంచి ఎదిగి ఈ రోజున చత్తీస్ గఢ్ కి సీఎం అవుతున్నారు. ఇక ఆయన నాలుగు టెర్ములు వరసగా రాయగఢ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1999 నుంచి 2019 దాకా అంటే రెండు దశాబ్దాల కాలం అన్న మాట. ఇక కేంద్రంలో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు

అదే విధంగా బీజేపీ చత్తీస్ గఢ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అన్నిటి కంటే కూడా ఆయన పార్టీకి వీర విధేయుడు. తుచ తప్పకుండా ప్రతీ విషయాన్ని పాటించే నిబద్ధత కలిగిన నాయకుడు. వీటితో పాటు ఆయన ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన వారు. చత్తీస్ గఢ్ రాష్ట్రం ఏర్పడి రెండు దశాబ్దాలు అయితే ఆదివాసీల నుంచి సీఎం అయిన వారు అప్పట్లో అజిత్ జోగీ. ఆ తర్వాత విష్ణు దేవ్ సాయి మాత్రమే.

ఇక అజిత్ జోగీ కుల దృవీకరణ పత్రాన్ని 2019లో ప్రభుత్వ అధికారులు రద్దు చేశారు. ఆ విధంగా చూస్తే విష్ణు దేవ్ సాయి తొలి ఆదివాసీ సీఎం గానే చూడాలి. చత్తీస్ గడ్ జనాభాలో ముప్పయి శాతం ఆదివాసీలు ఉన్నాయి. దాంతో పాటు విష్ణు దేవ్ సాయి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుంకరి శాసనసభ సీటు జాష్పూర్ జిల్లా పరిధిలోనికి వస్తుంది. అలాగే జాష్పూర్ జిల్లా ఒడిషా జార్ఖండ్ సరిహద్దులతో కలసి ఉంది. దాంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారీ రాజకీయ లాభాన్ని కోరుకుంటూ బీజేపీ చాలా వ్యూహాత్మకంగా విష్ణు దేవ్ సాయి ని సీఎం గా నియమించింది అని అంటున్నారు.

అయితే ఈ ఎంపిక విషయంలో కూడా బీజేపీ పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. మొదట్లో అయితే ఓబీసీకి చెందిన వారిని సీఎం చేయాలని భావించింది. అరుణ్ సావో, ఓపీ చౌదరి లాంటి ఓబీసీ నేతల పేర్లు కూడా చాలా సీరియస్ గానే పరిగణించింది. ఆదివాసీ నేతలలో కూడా రాం విచార్ నేతం, రేణుకా సింగ్ పేర్లు కూడా గట్టిగా వినిపించాయి.

ఇక గతంలో చత్తీస్ గఢ్ కి సీఎం గా పనిచేసిన రమణ్ సింగ్ పేరు ని కూడా బీజేపీ తొలుత పరిశీలించినా చివరికి విష్ణు దేవ్ సాయి దగ్గర ఆగింది. అయితే రమణ్ సింగ్ కి ఎంపిక చేయకపోయినా ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన విష్ణు ని ఎంపిక చేయడం ద్వారా మాజీ సీఎం కి ఆనందం కలిగించింది అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఆదివారం రాయపూర్ లో సమావేశం అయిన బీజేపీ ఎమ్మెల్యేలు శాసన సభా పక్ష నేతగా విష్ణు దేవ్ సాయిని ఎన్నుకున్నారు. బీజేపీ నుంచి కేంద్ర పరిశీలకులుగా అర్జున్ ముండా, శర్వానంద్ సోనోవాల్, దుష్యంత్ గౌతం లు అటెండ్ అయ్యారు.