Begin typing your search above and press return to search.

ప్లీజ్ జగన్ అసెంబ్లీకి రండి...!

జగన్ అసెంబ్లీకి వస్తే ఫేస్ చేద్దామనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశాను అని విష్ణు కుమార్ రాజు ఓపెన్ గానే చెప్పారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 7:48 AM GMT
ప్లీజ్ జగన్ అసెంబ్లీకి రండి...!
X

జగన్ అసెంబ్లీకి రావాలి. అపుడే కదా మజా. అందుకే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మనసులో ఉన్నది దాచుకోలేక చెప్పేశారు. సభ చప్పగా ఉందని అనేశారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఫేస్ చేద్దామనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశాను అని విష్ణు కుమార్ రాజు ఓపెన్ గానే చెప్పారు. ఆయనకీ అలా ఉంటే 135 సీట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీకి ఎలా ఉండాలి. అసెంబ్లీలో విపక్ష స్థానంలో జగన్ ఉంటే అనేక ప్రశ్నలు అడిగి కడిగేయాలని ఆయనను ప్రతీ ఇష్యూలో దోషిగా చూపించాలని కదా అనుకునేది.

అలా నిండు సభలో వైసీపీ పాలనను ఎండగట్టి మాజీ ముఖ్యమంత్రి అయిదేళ్ళ పాలన నిర్వాకం మీద డిబేట్లు పెట్టి అవసరం అయితే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ని అసెంబ్లీలో పెట్టి జగన్ ని నిలదీయాలని కదా సరదా. కానీ ఆచరణలో మాత్రం ఆ చాన్స్ జగన్ ఇవ్వడం లేదు.

ఆయనకు తెలుసు సభకు వెళ్తే ఏమి జరుగుతుందో. 23 సీట్లు తెచ్చుకున్న చంద్రబాబు నుంచి నలుగురు ఎమ్మెల్యేలను లాగేసి ఆ మీదట 19 మందితో సభలోకి వచ్చిన బాబుకు కార్నర్ చేసి రాగింగ్ చేసిన వైసీపీ ఏలుబడి ని అంతా చూశారు. ప్రతీ అంశం మీద మీ పాలన ఇలా ఉంది అంటూ ఎండగడుతూ టీడీపీని ఫుల్ ఫోకస్ చేశారు.

అయితే ఇపుడు తామూ అలాగే చేయాలనుకుంటే జగన్ అసెంబ్లీకి రాకపోతే ఎలా అన్నది అధికార పార్టీలో కనిపిస్తోందా అన్న చర్చ సాగుతోంది. జగన్ ప్లీజ్ అసెంబ్లీకి రండి అని అంటున్నారు. శాసన సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు.

అదే విధంగా చీఫ్ విప్ ధూళిపాళ్ళ నరేంద్ర కూడా అదే కోరారు. ఇక స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు అయితే జగన్ అసెంబ్లీకి రావాలి అని కోరారు. జగన్ కి ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోయినా ఆయనను గౌరవిస్తామని చెప్పారు.

స్పీకర్ ఎన్నిక వేళ సభలో లేకపోతే ఎలా అని అయ్యన్న ప్రశ్నించారు. ఎంతటి పెద్ద వారు అయినా సభా సంప్రదాయాలను గౌరవించాలి కదా అని స్పీకర్ అన్నారు. ఇక తన గురించి చెబుతూ గత ప్రభుత్వం చేసిన దౌర్జన్యాల మీదనే తాను మాట్లాడాను తప్ప మరోటి కాదని అన్నారు. తాను ఇపుడు బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్నానని అందువల్ల తనకు అలా మాట్లాడాల్సిన అవసరం లేదని అయ్యనపాత్రుడు అంటున్నారు.

మొత్తానికి కొత్త స్పీకర్ జగన్ ని గౌరవిస్తామని సభకు రావాలని కోరుతున్నారు. అదే విధంగా చూస్తే జగన్ సభకు వచ్చేలా చేయాలని ఒక వ్యూహం ప్రకారం అధికార పక్షం చూస్తోంది అని అంటున్నారు. తీరా తాను అసెంబ్లీకి వస్తే గతంలో తమ ప్రభుత్వంలో చంద్రబాబుని ర్యాగింగ్ చేసినట్లుగా తనకూ చేస్తారో అని జగన్ అనుమానిస్తున్నారు అని అంటున్నారు.

అందుకే జగన్ అసెంబ్లీకి రావడం లేదు అని అంటున్నారు. అయితే ఇక్కడే టీడీపీ వ్యూహం దాగుంది అని అంటున్నారు. జగన్ అసెంబ్లీకి రావాలని వారు కోరుతూనే ఉంటారు. అది ఆయన రానంతవరకూ కోరుతూనే ఉంటారు. దానికి కారణం ప్రజలకు కూడా తెలియాలి అని. తాము సభకు రమ్మంటే ఓట్లేసిన ప్రజల ఆశలను ఎమ్మెల్యేగా జగన్ తీర్చాల్సిన అసెంబ్లీకి తాను రాకుండా ఎమ్మెల్యేలను రానీయకుండా చేస్తున్నారు అన్న మేసేజ్ అయితే జనంలోకి వెళ్లేలా చేయడమే టీడీపీ స్ట్రాటజీ అని అంటున్నారు.

మరో వైపు చూస్తే జగన్ అసెంబ్లీకి రాకూడదని పూర్తిగా భావించుకుంటే మాతం టీడీపీ జనంలో ఆయన సభా బహిష్కరణను మరింతగా తీసుకుని వెళ్ళే ఆస్కారం ఉంది. జగన్ అసెంబ్లీకి వచ్చి అవమానం జరిగినపుడే దానిని సాకుగా చూపించి బయటకు వస్తే కొంతలో కొంత జస్టిఫికేషన్ గా ఉంటుందని అంటున్నారు.

చంద్రబాబు కూడా రెండున్నరేళ్ళ పాటు అసెంబ్లీకి వచ్చారు అని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ జగన్ సభకు రాదలచుకోకుంటే తన పార్టీ ఎమ్మెల్యేలను అయినా పంపినా కొంతలో కొంత జనాలకు చెప్పుకునేందుకు వీలు అవుతుంది అని అంటున్నారు. మొత్తానికి జగన్ కి ఇపుడు అసెంబ్లీకి రావాలా వద్దా అన్నది అతి పెద్ద సమస్య కావడమే విశేషంగా ఉంది అని అంటున్నారు.