Begin typing your search above and press return to search.

పదేళ్ల విస్తారా జర్నీ ముగింపు.. చివరి ఫ్లైట్ ఎప్పుడంటే?

ఆ తర్వాతి నుంచి ఈ సంస్థ విమానాల్ని ఎయిరిండియా బ్రాండ్ మీద నడుపుతారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 5:30 AM GMT
పదేళ్ల విస్తారా జర్నీ ముగింపు.. చివరి ఫ్లైట్ ఎప్పుడంటే?
X

మన దేశంలో మరో ఎయిర్ లైన్స్ ప్రయాణం ముగియనుంది. అయితే.. ఈ ముగింపు మరో కొత్త ప్రయాణానికి కారణం కావటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. పరిమితంగా విమానయాన సేవల్ని అందించే సంస్థగా విస్తారా ఎయిర్ లైన్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. టాటా గ్రూపు.. సింగపూర్ ఎయిర్ లైన్స్ సంయుక్త సంస్థగా విస్తారా తెలిసిందే. ఈ బ్రాండ్ కింద తమ చివరి విమానాన్ని నవంబరు 11న నడపనున్నారు. ఆ తర్వాతి నుంచి ఈ సంస్థ విమానాల్ని ఎయిరిండియా బ్రాండ్ మీద నడుపుతారు.

నవంబరు12 నుంచి ఎయిర్ విస్తారా కింద బుక్ చేసుకున్న టికెట్లన్నింటిని.. ఎయిరిండియా వెబ్ సైట్ కు మళ్లేలా విస్తారా ఏర్పాట్లుచేసింది. నవంబరు 11 వరకు ప్రయాణించే విమానాలనను మాత్రం విస్తారా వెబ్ సైట్ లోనే బుకింగ్ లు కొనసాగుతాయి. విస్తారా సిబ్బంది.. విమానాలు అన్నీ కూడా ఎయిరిండియా నిర్వహణలోకి వెళ్లనున్నాయి. దీనికి సంబంధించి 2025 వరకు ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేస్తున్నారు.

విస్తారా.. ఎయిరిండియా విలీనం తర్వాత ప్రపంచంలో అతి పెద్ద విమానయాన గ్రూపుల్లో ఎయిరిండియా గ్రూపు ఒకటిగా మారుతుందని చెబుతున్నారు. మొత్తం 23వేల మందికి పైగా ఉద్యోగులు ఈ గ్రూపులో ఉన్నారు. విలీన ప్రక్రియ ప్రతిపాదనలో భాగంగా రూ.2058.5కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టటానికి కేంద్రం శుక్రవారం అనుమతుల్ని ఇచ్చింది. ఇంతకు ముందు ప్రకటించిన విలీనంలో భాగంగా ఎయిరిండియా గ్రూపులో సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 25.1 శాతం వాటా లభించనుంది.

ఇప్పటివరకు దేశంలో విస్తారాకు 70 విమానాలు ఉన్నాయి. మొత్తం 50 గమ్యస్థానాలకు తన సేవల్ని అందిస్తోంది. దేశీయంగా జులై నాటికి దీని మార్కెట్ వాటా 10 శాతంగా ఉంది. ఒకప్పుడు ఎయిరిండియా గ్రూపులో.. ఎయిరిండియా.. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్.. ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఏయిరేషియా ఇండియా).. విస్తారాలు ఉండేవి. తాజా పరిణామంతో ఇకపై ఎయిరిండియా గ్రూపులో ఎయిరిండియా.. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ లు మాత్రమే మిగలనున్నాయి.