వివేక్ రామస్వామి కీలక నిర్ణయానికి ఇదేనా అసలు కారణం?
గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం ట్రంప్ ఓ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు.
By: Tupaki Desk | 21 Jan 2025 6:55 AM GMTగత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం ట్రంప్ ఓ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా... డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డొజ్) ను ఏర్పాటు చేశారు. వృథా ఖర్చులను తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకురావడమే దీని లక్ష్యం అని చెప్పారు.
ఇంత కీలకమైన డొజ్ బాధ్యతలను భారతీయ అమెరికన్ బిజినెస్ మేన్ వివేక్ రామస్వామితో పాటు ప్రపంచ కుబేరుడు, ట్రంప్ కు ఆత్మీయుడు, టెస్లా అధినేత అయిన ఎలాన్ మస్క్ కు అప్పగించారు. వీరిద్దరూ డోజ్ కు సంయుక్త సారధులుగా డొనాల్డ్ ట్రంప్ నియమించారు. అయితే.. తాజాగా ఆ బాధ్యతల నుంచి రామస్వామి వైదొలిగారు.
అవును... ట్రంప్ 2.0 లో అత్యంత ప్రతిష్టాత్మక పాత్ర పోషించబోయే అవకాశం ఉందని చెబుతున్న డోజ్ బాధ్యతల నుంచి వివేక్ రామస్వామి వైదొలిగారు. దీంతో... ఈ విషయం ఆసక్తిగా మారింది. ఆయన ఇంత కీలక బాధ్యతల నుంచి ఎందుకు వైదొలిగారనే చర్చ కీలకంగా మారింది. అయితే.. అందుకు ఓ కారణం తెరపైకి వచ్చింది.
వాస్తవానికి అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం 2026 జూలై 4న జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఆ తేదీలోపు డోజ్ లక్ష్యమైన వృథా ఖర్చులను తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకురావడం పూర్తి చేసి, అనంతరం గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివేక్ రామస్వామి సమాయత్తమవుతున్నట్లు ఇటీవల కథనాలొచ్చాయి.
అయితే... ఈ లోపు వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో, పూర్తిగా ఆ పనులపైనే దృష్టి పెట్టాలని భావించే వివేక్ తాజా నిర్ణయం తీసున్నట్లు చెబుతున్నారు. అంతకు మించి మరో కారణం ఏమీ లేదని అంటున్నారు. వచ్చే ఏడాది నవంబర్ లో ఒహైయో గవర్నర్ ఎన్నికలు జరగనున్నాయి.
కాగా గత ఏడాది నవంబర్ లో జరిగిన ఆధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోసం తీవ్రంగా శ్రమించినవారిలో ఒకరైన వివేక్.. ట్రంప్ తరుపున అనేక ఇంటర్వ్యూలో వాదనలు వినిపించారు. ఈ క్రమంలో మొదట ఆయనకు విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరిగినా.. డోజ్ కు మస్క్ తో పాటు సారథిగా నియమించారు.