వివేక్ వెంకటస్వామికి చెక్ పడినట్లేనా ?!
తెలంగాణ ప్రభుత్వంలో మిగిలిపోయిన ఆరు మంత్రి పదవుల మీద అనేక మంది ఆశలు పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 3 Sep 2024 9:30 AM GMTతెలంగాణ ప్రభుత్వంలో మిగిలిపోయిన ఆరు మంత్రి పదవుల మీద అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, బీర్ల అయిలయ్య, వాకిట శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, పద్మావతి, బాలూ నాయక్, మల్ రెడ్డి, రంగారెడ్డి, దానం నాగేందర్ తదితరులు మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు.
వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖాయం అని, భర్తీ చేసే ఆరు పదవులలో ఒకటి ఆయనకు గ్యారంటీ అని ఇప్పటి వరకు చర్చ జరిగింది. అయితే తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లా పర్యటన నేపథ్యంలో చెన్నూరు నియోజకవర్గం కూడా పర్యటించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దయింది.
ఈ సంధర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు త్వరలోనే ఉన్నత పదవిలో ఉండబోతున్నారని చెప్పడంతో ఇక వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కష్టమేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో సీనియర్ అయిన ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ సీనియర్లు కాంగ్రెస్ అధిష్టానాన్ని పట్టుబట్టినట్లు తెలుస్తుంది.
అయితే ముఖ్యమంత్రి రేవంత్ సహకారంతో వివేక్ మంత్రిపదవి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యే కాగా, ఆయన సోదరుడు గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే. గత లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడికి పెద్దపల్లి ఎంపీ టికెట్ తీసుకుని అందరి సహకారంతో గెలిపించుకున్నాడు. అప్పట్లో తన కుమారుడికి ఎంపీ సీటు ఇస్తే తనకు మంత్రి పదవి అవసరం లేదని చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తీరా కుమారుడు గెలిచాక మళ్లీ మంత్రి పదవి అడుగుతుండడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. మొత్తానికి మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలను బట్టి ప్రేమ్ సాగర్ రావుకు పదవి ఖాయం అని తెలుస్తుంది.