పులివెందులలో వివేకా భార్య పోటీ!... బీటెక్ రవి డ్రాప్..?
మరోపక్క టీడీపీ నుంచి బీటెక్ రవి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 April 2024 4:20 AM GMTరాష్ట్ర వ్యాప్తంగా సంగతి కాసేపు పక్కనపెడితే... కడప జిల్లాలో మాత్రం వైఎస్ వివేకా మర్డర్ కేసు వ్యవహారం రోజు రోజుకీ తీవ్ర సంచలనం అవుతోంది! రానున్న ఎన్నికల్లో ఈ ఒక్క కారణంతోనే జగన్ ను, కుటుంబ సభ్యులు టార్గెట్ చేశారనే కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే వైఎస్ షర్మిళ, సునీత లు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తున్నారు.. వారి లక్ష్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నారు.
జగన్ తిరిగి ముఖ్యమంత్రి అయితే తనతో పాటు ఏపీ ప్రజలూ ఇబ్బంది పడతారని సునీత చెబుతుంటే... అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడనే విషయం తట్టుకోలేక తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వైఎస్ షర్మిళ ప్రకటించారు. దీంతో... షర్మిళకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు సునీత. ఈ సమయంలో పులివెందులలో జగన్ పై ఎవరు పోటీ చేస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో... వైఎస్ వివేకా భార్య పేరు వినిపిస్తోంది!
అవును... ఇప్పటికే కడప ఎంపీ స్థానాన్ని షర్మిళ టార్గెట్ చేయగా.. పులివెందుల ఎమ్మెల్యే స్థానంలో జగన్ పై పోటీకి వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ బరిలోకి దిగనున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు టిక్కెట్ ఇచ్చి... జగన్ పై బరిలోకి దించాలానే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయని చెబుతున్నారు. దీంతో... ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
మరోపక్క టీడీపీ నుంచి బీటెక్ రవి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులివెందులలో ఒక అనూహ్యపరిణామం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వైఎస్ కుటుంబంపై పలుమార్లు పోటీ చేసి ఓటమిపాలైన సతీష్ కుమార్ రెడ్డి.. ఇటీవల వైసీపీలో జాయిన్ అయిపోయారు. ఆయన సుమారు మూడు దశాబ్ధాలుగా వైఎస్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు!
పులివెందులలో పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ బరిలోకి దిగబోతున్నారంటూ వస్తోన్న వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో... ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడితే... పులివెందులలో టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారా.. లేక, వివేకాపై ఉన్న సానుభూతితో బాబు పోటీని విత్ డ్రా చేసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది!