ఇట్లు నీ చిన్నమ్మ... జగన్ కు వివేకా భార్య సంచలన లేఖ!
ఈ పరిస్థితుల్లో... వివేకా హత్య కేసులో అవినాష్ కు జగన్ మద్దతు, మొదలైన అంశాలను ప్రస్తావిస్తూ వివేకా భార్య సౌభాగ్యమ్య సీఎంకు లేఖ రాశారు.
By: Tupaki Desk | 25 April 2024 9:57 AM GMTఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం కడప రాజకీయాల్ని కుదిపేస్తోందనే చెప్పాలి! ఇప్పటికే అవినాష్ మరోసారి కడప ఎంపీ బరిలో దిగడంతో ఆయనకు పోటీగా సోదరి షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ సమయంలో షర్మిళకు వివేకా కుమార్తె సునీత సంపూర్ణ మద్దతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో... వివేకా హత్య కేసులో అవినాష్ కు జగన్ మద్దతు, మొదలైన అంశాలను ప్రస్తావిస్తూ వివేకా భార్య సౌభాగ్యమ్య సీఎంకు లేఖ రాశారు.
రాజకీయాలతో రాష్ట్రంలో ఉక్కబోత పెరిగిపోతుందని అంటున్న నేపథ్యంలో... కడప రాజకీయాలు మరింత వేడెక్కించేస్తున్నాయి! తాజాగా కడప పర్యటన చేపట్టిన జగన్... నామినేషన్ దాఖలు చేశారు. అంతక ముందు పులివెందులలో జరిగిన బహిరంగ సభలో సంచలన ప్రసంగం చేశారు! ఈ సమయంలో.. అవినాష్ రెడ్డి ఎటువంటి తప్పూ చేయలేదనే తాను అండగా ఉన్నట్లు తెలిపారు! ఆ సంగతి ఆలా ఉంటే... తాజాగా జగన్ కు సౌభాగ్యమ్మ లేఖ రాశారు!
అవును... వైఎస్ వివేకా హత్య, తదనంతర పరిణామాలు, అవినాష్ రెడ్డికి టిక్కెట్ మొదలైన అంశాలపై సౌభాగ్యమ్మ లేఖ రాశారు. ఇందులో భాగంగా... "2009లో మీ తండ్రిని కోల్పోయినపుడు నువ్వు ఎంత మనోవేదన అనుభవించావో.. 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించింది. మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారణం కావడం.. వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం ఎంతో బాధించింది" అంటూ మొదలుపెట్టారు వివేకా భార్య!
ఇదే సమయంలో... "నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నపై నీ సొంత మీడియా, పార్టీ వర్గాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం నీకు తగునా? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతున్నారు. కొంతమంది దాడులకూ తెగబడేస్థాయికి దిగజారుతున్నా నీకు పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలనూ టార్గెట్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమేంటి?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదే క్రమంలో... "కుటుంబసభ్యునిగా కాకపోయినా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం సమంజసమా? ఇలాంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు! హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్ దాఖలు చేశాడు! చివరి ప్రయత్నంగా ప్రార్థిస్తున్నా.. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా.. న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడాలని వేడుకుంటున్నా.. ఇట్లు మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ" అని తన లేఖలో పేర్కొన్నారు వివేకా భార్య!