అప్పుడేమో సీతను.. ఇప్పుడేమో రావణుడినా? వివేక్ వేదన!
నిజమే.. మెడలో ఉన్న పార్టీ కండువా మారినంతనే లెక్కలు ఇంతలా మారిపోతాయా? అన్న వేదన కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామికి అంతకంతకూ ఎక్కువ అవుతోంది
By: Tupaki Desk | 24 Nov 2023 3:47 AM GMTనిజమే.. మెడలో ఉన్న పార్టీ కండువా మారినంతనే లెక్కలు ఇంతలా మారిపోతాయా? అన్న వేదన కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామికి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గతంలో పార్టీలు మారే నేతల విషయంలో పార్టీలు వ్యవహరించే తీరుతో పోలిస్తే.. మోడీషాల మాష్టార్ల లెక్కలు ఎంత కఠినంగా.. కర్కశంగా ఉంటాయన్నది అనుభవపూర్వకంగా అర్థమవుతున్న వేళ.. వివేక్ వేదన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మొన్నటివరకు బీజేపీలో ఉండి.. ఎన్నికల వేళ.. కమలం పార్టీకి కటీఫ్ చెప్పేసి కాంగ్రెస్ గూటికి చేరిన ఆయనకు వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈడీ సోదాలు మొదలు.. తను చేసే వ్యాపార వ్యవహారాల్లో లొసుగులు ఉన్నట్లుండి తెర మీదకు వస్తున్న వైనంపైఆయన బరస్ట్ అయ్యారు. బీజేపీలో ఉన్నప్పుడు తాను సీతలా.. కాంగ్రెస్ లో చేరిన తర్వాత రావణుడిలా కనిపిస్తున్నానా? అంటూ సీరియస్ అయ్యారు. తనపై జరుగుతున్న ఈడీ దాడులు మొత్తం కేంద్ర మంత్రి అమిత్ షా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేత్రత్వంలోనే జరుగుతున్నట్లుగా ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పుకొచ్చారు. హుజూరాబాద్.. మనుగోడు ఎన్నికల వేళలో బీజేపీ నేత ఈటెల రాజేందర్ భూములకు సంబంధించి ఆయనకు రూ.27 కోట్లు ఇచ్చానని.. లావాదేవీలనని చట్టప్రకారం జరిగినా.. ఆ భూముల వ్యవహారంలో తనకు నోటీసులు ఇవ్వటాన్ని ప్రశ్నించారు. ఆ భూముల వ్యవహారంలో తనకు నోటీసులు ఇచ్చినప్పుడు ఈటెల రాజేందర్ కు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? అన్న ఆయన ప్రశ్న లాజిక్ కు సరిపోయేలా ఉన్నప్పటికి.. ఇప్పటి వ్యవస్థలు ఇలానే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2014 ఎన్నికల వేళలో కేసీఆర్ కు ఆర్థిక సాయం అందించానని.. అలాంటి వ్యక్తికి నేడు వేలాది కోట్లు ఎలా సంపాదించారంటూ సూటి ప్రశ్న సంధించిన వివేక్.. ఇటీవల తన కంపెనీలో షేర్ల అమ్మకం ద్వారా రూ.50 కోట్లు లాభం వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ లావాదేవీకి సంబంధించి తాను రూ.9కోట్లు పన్నులు చెల్లించినట్లు చెప్పారు. బీజేపీ.. బీఆర్ఎస్ లు ఒక్కటయ్యాయని.. అందుకే తాను బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరినట్లుగా చెప్పిన వివేక్ విషయంలో ఒక్క సందేహం రాక మానదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అప్పు ఇచ్చే పెద్ద మనిషి.. ఆయన పార్టీలోనే ఉండిపోతే సరిపోతుంది కదా? పిల్లి పిల్లల్ని పెట్టిన తర్వాత ఇళ్లు మార్చినట్లుగా.. పార్టీలను మార్చేయటం ఎందుకు? అన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వినిపిస్తుండటం గమనార్హం.