కేసీఆర్ కు అప్పిచ్చిన పెద్ద మనిషిపై కేసీఆర్ శిష్యుడి పోటీ
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రికే అప్పు ఇచ్చిన వివేక్ మీద ఆయన తన శిష్యుడ్ని పోటీగా నిలబెట్టటం తెలిసిందే.
By: Tupaki Desk | 16 Nov 2023 5:30 PM GMTరాజకీయం లెక్కలే వేరుగా ఉంటాయి. దేని లెక్క దానిదే అన్నట్లుగా ఉంటుంది. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండొచ్చు కానీ.. వ్యక్తిగతంగా మాత్రం మిత్రులుగా ఉండే ఉదంతాలు బోలెడన్ని కనిపిస్తాయి. రాజకీయం దారి రాజకీయానిదే.. వ్యక్తిగతం దారి వ్యక్తిగతానిదే. గడిచిన కొన్నేళ్లుగా పరిస్థితులు మారి..రాజకీయాన్ని వ్యక్తిగత వైరం స్థాయికి తీసుకెళ్లటంతో లెక్కల్లో కాస్త తేడా వచ్చినప్పటికీ.. ఇప్పటికి రాజకీయాలకు అతీతమైన స్నేహాల్ని చూస్తుంటాం. తాజా ఎన్నికల కారణంగా ఒక ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన నామినేషన్ లో తాను రూ.కోటికి పైగా మొత్తాన్ని మొన్నటి వరకు బీజేపీలో ఉండి.. తాజా ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి నుంచి అప్పుగా తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ కే అప్పు ఇవ్వటమంటే మాటలా? యాబై ఎకరాలకు పైనే ఆసామి.. ఒక మీడియా సంస్థలో షేర్లున్న కేసీఆర్ కు డబ్బులు అవసరమైతే.. తమకు ప్రత్యర్థిగా ఉండే పార్టీలో ఉన్న నేత నుంచి డబ్బులు అప్పుగా తీసుకోవటమా? అని ఆశ్చర్యపోయారు.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రికే అప్పు ఇచ్చిన వివేక్ మీద ఆయన తన శిష్యుడ్ని పోటీగా నిలబెట్టటం తెలిసిందే. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా.. తర్వాతి కాలంలో నాటి టీఆర్ఎస్ లో చేరి.. 2014లో ఎంపీగా ఇదే వివేక్ మీద గెలిచిన బాల్క సుమన్.. తాజాగా మరోసారి వివేక్ మీద పోటీకి దిగారు. తొమ్మిదేళ్ల క్రితం వారిద్దరు ఎంపీ స్థానం కోసం పెద్దపల్లి స్థానం నుంచి బరిలోకి దిగగా.. ఆ ఎన్నికల్లో వివేక్ ను ఓడించటం ద్వారా బాల్క సుమన్ సంచలనంగా మారారు. తాజా ఎన్నికల్లో ఇప్పుడు వారిద్దరు మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి పోటీ చేస్తున్నారు. పాత ప్రత్యర్థుల మధ్య నడుస్తున్న తాజా పోరు ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.