నేను చిన్నవాడ్ని అనుకుంటున్నారు.. మాటలతో మనసు దోచేసిన వివేక్
షానన్ లో జరిగిన రెండో డిబేట్ లో వివేక్ రామస్వామికి మంచి పేరు వచ్చినప్పటికీ.. ఆయన చిన్న వయసు ఇప్పుడు చర్చగా మారింది
By: Tupaki Desk | 19 Sep 2023 4:23 AM GMTభారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి రావటం తెలిసిందే. విపక్ష రిపబ్లికన్ పార్టీలో మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ట్ ట్రంప్ తో పోటీ పడుతూ.. తమ పార్టీ నుంచి అధ్యక్ష పదవి రేసులో తాను ఉండాలన్న ప్రయత్నాలు ఆయన పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఇమేజ్ భారీగా పెరుగుతోంది. తన మాటలతో ప్రపంచ వ్యాప్తంగా తన గురించి మాట్లాడుకునేలా చేసిన వివేక్ రామస్వామి.. సొంత దేశంలోనూ ఆయనకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది.
వివేక్ రామస్వామికి పెరుగుతున్న ఆదరణ అనూహ్యంగా మారింది. ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఆయన పాపులార్టీ 12 శాతం పెరగటం మామూలు విషయం కాదంటున్నారు. తాజాగా ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి తనను తాను అందరికి అర్థమయ్యేలా చేయటమే కాదు.. తనను ఆవిష్కరించుకున్న వైనం ఆకట్టుకునేలా మారిందని చెప్పక తప్పదు.
షానన్ లో జరిగిన రెండో డిబేట్ లో వివేక్ రామస్వామికి మంచి పేరు వచ్చినప్పటికీ.. ఆయన చిన్న వయసు ఇప్పుడు చర్చగా మారింది. ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. తన ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారని.. తాను చాలా చిన్నవాడ్ని అని.. 38 ఏళ్ల వ్యక్తి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండటం ఏమిటంటూ వారు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. తన వయసు మీద కొందరు చేస్తున్న చర్చకు చెక్ చెప్పేలా బలమైన వాదనను వినిపించారు.
''నేను చాలా చిన్న వయస్కుడినని.. 38 ఏళ్ల వ్యక్తి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం ఏమిటని వారి మనసు ఒప్పుకోవటం లేదు. వాస్తవం ఏమంటే.. అమెరికా స్వాతంత్య్రం డిక్లరేషన్ రాసిన సందర్భంలో థామస్ జఫర్సన్ వయసు 33 ఏళ్లు మాత్రమే. ఇదే వయసులో స్వివెల్ కుర్చీని కూడా కనుగొన్నారు. ఆ స్ఫూర్తిని పునరుద్ధరించాల్సిన అవసంర ఉంది. నా జీవితంలో మంచి రోజులు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అమెరికా కూడా ఇంకా మంచి రోజులు చూడగలదని నమ్ముతున్నా'' అని మనసుల్ని దోచేలా మాట్లాడారు.
తన ప్రత్యర్థి.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన్ను అతివాదిగా అభివర్ణించారు. బైడెన్ ను తాను ఎక్కువగా విమర్శించనన్న వివేక్ రామస్వామి.. ''అందుకు ఇది సరైన ప్రదేశం కాదు. మనం దేని గురించి పరిగెడుతున్నాం. మనకంటూ ఒక సొంత విజన్ ఉండాలి. మెరిటోక్రసీని పునరుద్దరించటం.. శ్రేష్టతను సాధించటం.. స్వేచ్ఛగా మాట్లాడటం.. బహిరంగ చర్చల ద్వారా విషయాల్ని పంచుకోవటం లాంటివి చాలామంది అమెరికన్లకు ఇప్పటికీ ప్రాథాన్యతను ఇస్తారు'' అని పేర్కొన్నారు. 1980 నాటి రోనాల్ట్ రీగన్ శైలి.. నైతికతను అందించటానికి అవకాశం ఉందని తాను బలంగా విశ్వసిస్తానని వ్యాఖ్యానించారు. తన ఎదుగుదలను ఓర్వలేని ప్రత్యర్థులు చేసే విమర్శల్ని స్వీకరించినప్పటికీ తాను వారిలో ఎవరికీ వ్యతిరేకంగా పోటీ చేయటం లేదన్నారు. మొత్తంగా తన మాటలతో మనసుల్ని దోచేస్తున్న వివేక్ రామస్వామి.. అధ్యక్ష ఎన్నికల కోసం తాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నారని చెప్పాలి.