ఉండాలా? వద్దా? ఏ పార్టీ పిలవట్లేదు.. ఉన్న పార్టీ విలువివ్వట్లేదు!!
ప్రస్తుతం బీజేపీలో ఉన్న వివేక్‌కు పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 30 Oct 2023 11:30 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక మంది నాయకులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఉన్న పార్టీ టికెట్ ఇస్తుందనే గ్యారెంటీ లేకపోవడం.. పొరుగు పార్టీలు కనీసం ఈ నేతలను పట్టించుకోక పోవడంతో కొందరు నాయకులు.. తర్జన భర్జన పడుతున్నారు. అసలు ఉండాలా? వద్దా? అనే మీమాంసలో పడుతున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి మాజీ ఎంపీ, కాకా కుమారుడు వివేక్ ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న వివేక్‌కు పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఆయన కోరుకున్నట్టుగా టికెట్ల పంపిణీ లేకపోవడం, కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో అంటీముట్టనట్టు వ్యవహారాలు నడుస్తుండడంతో వివేక్ కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ, పార్టీ మారేందుకు ఆయన ఇష్టంగానే ఉన్నా.. ఆయన ఎదురు చూస్తున్న పార్టీ మాత్రం వివేక్‌ను పట్టించుకోవడం లేదు.
గతంలో కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన కాకా(వెంకటస్వామి) కుమారుడిగా .. ఒకప్పుడు కాంగ్రెస్‌లో వివేక్ పరిస్థితి బాగుంది. అయితే.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. తగిన ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇక, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. అయినా.. ఏమాత్రం అవకాశం చిక్కినా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన రెడీగానే ఉన్నారు. అంతేకాదు.. చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీకి కూడా సై అంటున్నారు.
ఎటొచ్చీ.. వివేక్ విషయాన్ని ఇటు రేవంత్‌రెడ్డి కానీ.. అటు కాంగ్రెస్ అధిష్టానం కానీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. దీంతో పార్టీ మార్పు విషయంలో ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. మొత్తానికి ఎన్నికల సమయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనివివేకా అనుచరులు ఒత్తిడి పెంచుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.