Begin typing your search above and press return to search.

మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు... తెరపైకి కీలక విషయాలు!

గతకొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న ఐటీ సోదాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Nov 2023 5:31 AM GMT
మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు... తెరపైకి కీలక విషయాలు!
X

గతకొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న ఐటీ సోదాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో బీఆరెస్స్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతల ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరిగాయి. ఇదే సమయంలో తాజాగా కేసీఆర్ ప్రచార రథాన్ని కేంద్ర బలగాలు తనిఖీలు చేశాయి! ఈ సమయంలో తాజాగా మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు తెల్లవారుజామున మొదలయ్యాయి.

అవును... మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులోని మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో చెన్నూరుతోపాటూ.. సోమాజీగూడలో ఉన్న ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి! అదేవిధంగా పార్టీ కార్యాలయాలు, బంధువుల ఇళ్లు, ఆఫిసుల్లో సైతం ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గత కొన్ని రోజుల నుండి వివేక్‌ కు చెందిన కంపనీల డబ్బును చెన్నూర్ నియోజక వర్గంలో ఓటర్లను కొనేందుకు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు చెన్నూరు బీఆరెస్స్ అభ్యర్థి బాల్క సుమన్.. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు! దీంతో... ఈ రోజు తెల్లవారుజామునుంచి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు దాడులు నిర్వహిస్తోంది!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి కొత్త సమస్య వచ్చిపడింది! ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయనకు చెందిన పలు కంపెనీల్లోకి భారీగా నగదు వచ్చి చేరినట్లు నిఘా వర్గాలు గుర్తించాయని అంటున్నారు. దీంతో విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ కంపెనీల్లో నగదును సీజ్ చేశారు. ఇందులో భాగంగా... ఈ రెండు సంస్థలకు చెందిన ఖాతాల్లో జమ అయిన రూ.8కోట్లను స్తంభింపచేశారు.

నవంబర్ 13వ తేదీన వివేక్‌ కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విజిలెన్స్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఖాతాల్లోకి రూ.8 కోట్లు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. గుర్తు తెలియని ఖాతాల నుంచి పెద్దఎత్తున నగదు బదిలీ అయ్యిందంటూ సైఫాబాద్‌ పోలీసులకు ఎన్నికల సంఘం నుంచి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నగదు లావాదేవీలపై ఆరా తీశారు. అనంతరం రెండు ఖాతాల్లో జమ అయి నగదును వెంటనే స్తంభింప జేశారు.

మరోవైపు కాంగ్రెస్‌ నాయకుడు వివేక్ నివాసం, ఆఫీసులపై ఐటీ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. చెన్నూరులో వివేక్ నివాసం ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుతున్నారు.. నిరసనకు దిగారు. అనంతరం.. కక్ష సాధింపులో భాగంగానే ఐటీ సోదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీఆరెస్స్, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.