ఆ దళిత బీజేపీ నేత మళ్లీ కాంగ్రెస్ గూటికి?
కాగా, రాష్ట్రంలో బీజేపీ తరఫున క్రియాశీలంగా వ్యవహరించిన వివేక్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలిసింది.
By: Tupaki Desk | 29 Aug 2023 11:16 AM GMTఆయనో వ్యాపార దిగ్గజం.. తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్నీ పుణికిపుచ్చుకున్నారు. అటు వ్యాపారం.. ఇటు రాజకీయాలను సమంగా చూస్తూ ఓ దశలో కీలకంగా ఎదిగారు. అయితే, అన్ని రోజులు ఒకలా ఉండవు కదా..? వ్యాపారంలో దిగ్విజయమైన ఆయన రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఆ ఫలితంగా పదేళ్లుగా వెనుకబడిపోయారు.
దశాబ్దాల అనుబంధం ఆ వ్యాపార రాజకీయవేత్తది కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం. అది కూడా మామూలు అనుబంధం కాదు.. గాఢానుబంధం. ఆయన తండ్రి కేంద్ర మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కూడా ఆయన. అలాంటి రాజకీయ నాయకుడి కుమారుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన రాజకీయ వ్యాపారవేత్త తొలుత బాగానే రాణించారు. కానీ, అనూహ్య నిర్ణయాలతో వెనుకబడ్డారు.
పెద్దపల్లి పెద్దన్న తెలంగాణ రాజకీయాల్లో కాకా వెంకటస్వామి అంటే తెలియని వారుండరు. ఉమ్మడి ఏపీలోనూ ఆయన పెద్ద దళిత నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలు కొనసాగిన ఆయన తెలంగాణను కళ్లారా చూడాలని కలలు కన్నారు. అది సాకారమయ్యాక చనిపోయారు. ఆయన రెండో కుమారుడే వివేక్ వెంకటస్వామి. పెద్ద కుమారుడు వినోద్ గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి గెలిచి వైఎస్ మంత్రి వర్గంలో పనిచేశారు. వెంకటస్వామి దశాబ్దాల పాటు పెద్దపల్లి నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు.
ఆయన రాజకీయాల నుంచి తప్పుకొన్నాక 2009లో వివేక్ అక్కడినుంచి గెలిచారు. అనంతరం టీవీ మీడియానూ నెలకొల్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన మీడియా ప్రత్యేక రాష్ట్ర కాంక్షను బలంగా చాటింది. ఇలాంటి సమయంలోనే కేసీఆర్ పిలుపుతో వివేక్ బీఆర్ఎస్ లో చేరారు. అందులోనే కొనసాగి ఉంటే పదవులు దక్కేవేమో..? కానీ, ఎన్నికలకు ముందు మళ్లీ సొంత గూటికి వచ్చారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ డీలా పడడంతో చివరకు బీజేపీలో చేరారు. అయితే, 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఉంటే పెద్దపల్లి ఎంపీగా గెలిచేవారేమో కానీ.. టికెట్ రాలేదు.
బీజేపీలో క్రియాశీలంగా..2018 నుంచి బీజేపీలో ఉన్న వివేక్ కు మంచి స్థానమే దక్కింది. ఆయనకు పార్టీ జాతీయ కార్యవర్గంలోనూ చోటు దక్కింది. కాగా, రాష్ట్రంలో బీజేపీ తరఫున క్రియాశీలంగా వ్యవహరించిన వివేక్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలిసింది. ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సమాచారం. దశాబ్దాలుగా అనుబంధం ఉన్న పారట్ కావడంతో పాటు ప్రస్తుత పరిణామాల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుండడం, అదే సమయంలో బీజేపీ మరీ వెనుకబడి పోవడం వివేక్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఒకవేళ ఆయన గనుక కాంగ్రెస్ లోకి వెళ్తే అది పెద్దపల్లితో పాటు దళిత సామాజిక వర్గంలో కాంగ్రెస్ కు మంచి ఊపు తెస్తుంది. కాగా, పార్టీ మార్పుపై వివేక్ అధికారికంగా స్పందించలేదు.