Begin typing your search above and press return to search.

అపర కుబేరుడి వ్యాఖ్యలపై ‘అమ్మాయి’ సంచలన వ్యాఖ్యలు!

ఇద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్‌ లో కమలా హారిస్‌ పైచేయి సాధించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   13 Sep 2024 8:30 PM GMT
అపర కుబేరుడి వ్యాఖ్యలపై ‘అమ్మాయి’ సంచలన వ్యాఖ్యలు!
X

ఈ ఏడాది నవంబర్‌ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్‌ లో కమలా హారిస్‌ పైచేయి సాధించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అపర కుబేరుడు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్‌ మస్క్‌ తన మద్దతును డోనాల్డ్‌ ట్రంప్‌ కు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కమలా హారిస్‌ కు మద్దతు ప్రకటించిన అమెరికన్‌ టాప్‌ పాప్‌ సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌ పై ఎలాన్‌ మస్క్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి.

చివరకు సొంత కూతురు వివియన్‌ జెన్నా విల్సన్‌ సైతం తన తండ్రి ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన తండ్రి.. టేలర్‌ స్విఫ్ట్‌ పై చేసిన విమర్శలు చూసి తనకు ఆయనపై జుగుప్స కలుగుతుందని వివియన్‌ జెన్నా విల్సన్‌ తెలిపారు. ఆయన వ్యాఖ్యలు అసహ్యాన్ని కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు. తన తండ్రి మహిళల ద్వేషించే వ్యక్తిని ఆమె బాంబుపేల్చారు.

తాను వచ్చే ఎన్నికల్లో కమలా హారిస్‌ కు మద్దతు తెలుపుతానని పాప్‌ సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టుపై స్పందించిన ఎలాన్‌ మస్క్‌ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో తన తండ్రి ఎలాన్‌ మస్క్‌.. టేలర్‌ స్విఫ్ట్‌ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన కుమార్తె వివియన్‌ జెన్నా విల్సన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు అత్యంత హేయం, అసహ్యకరమని అభివర్ణించారు. ఈ సందర్భంగా తన ఫాలోవర్లకు జెన్నా విల్సన్‌ ఒక సందేశమిచ్చారు. మీతో ఎవరైనా తన తండ్రిలాగా మాట్లాడితే మాట్లాడనివ్వవద్దని సూచించారు.

కాగా ఎలాన్‌ మస్క్‌ తన భార్య జస్టిన్‌ విల్సన్‌ తో 2008లో విడిపోయారు. వీరికి జేవియర్‌ అలెగ్జాండర్,గ్రిఫ్ఫిన్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. ఈ ఇద్దరు కుమారుల్లో జేవియర్‌ అలెగ్జాండర్‌ అమ్మాయిగా మారి తన పేరును వివియన్‌ జెన్నా విల్సన్‌ గా మార్చుకోవడం విశేషం.

ఈ నేపథ్యంలో తన తండ్రితో కలిసి ఉండాలని తాను అనుకోవడం లేదని అప్పట్లోనే జెన్నా విల్సన్‌ తెలిపారు. తన ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు అప్పట్లో వెల్లడించారు.