Begin typing your search above and press return to search.

వైజాగ్ హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్!... నిందితుడే బాధితుడు!?

ఇటీవల కాలంలో హనీ ట్రాప్ వ్యవహారాలు తెరపైకి వచ్చి హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Oct 2024 2:25 AM GMT
వైజాగ్ హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్!... నిందితుడే బాధితుడు!?
X

ఇటీవల కాలంలో హనీ ట్రాప్ వ్యవహారాలు తెరపైకి వచ్చి హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాల్లో తొలుత నిందితులు అనుకున్నవారు తర్వాత బాధితులుగా మారిన సందర్భాలు కూడా చాలానే ఉంటుంటాయి. ఈ క్రమంలో తాజాగా వైజాగ్ లో వెలుగులోకి వచ్చిన జాయ్ జేమిమ అనే మహిళ హనీ ట్రాప్ కేసులో సరికొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.

అవును... ఇటీవల వైజాగ్ లో ఓ హనీట్రాప్ వ్యవహారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. స్థానిక మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఓ యువతి ఇన్ స్టా ద్వారా షీలానగర్ కు చెందిన ఓ ఎన్నారై యువకుడితో పరిచయం పెంచుకుంది. అతనితో పాటు ఆ ఫ్యామిలీ కొంతకాలంగా అమెరికాలోనే ఉంటోంది. ఈ సమయంలో జాయ్ జెమీమా అనే యువతి అతడితో పరిచయం పెంచుకుంది.

ఈ క్రమంలో.. అతడి తల్లితండ్రులు షీలానగర్ లో ఉన్న సమయంలో అడ్రస్ తెలుసుకుని ఇంటికి వెళ్లింది. వారితో మంచిగా నటించి.. మీ అబ్బాయి స్నేహితురాలిని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. అయితే అందుకు ఆ యువకుడి పేరెంట్స్ నిరాకరించారు. అనంతరం వారు తిరిగి అమెరికా వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో తల్లితండ్రుల వద్ద ఉంటున్న ఆ యువకుడికి మాయ మాటలు చెప్పి విశాఖకు రప్పించింది జెమీమా! ఈ సమయంలో విశాఖ విమానాశ్రయం నుంచే నేరుగా తన ఇంటికి తీసుకెళ్లిన ఆమె.. మత్తు పదార్ధాలు కలిపిన జ్యూస్ తాగించి, అతడితో సన్నిహితంగా ఉంటున్నట్లుగా ఫోటోలు తీసుకుని, బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టిందట.

ఈ క్రమంలో ఇటీవల భీమిలోని ఓ హోటల్లో బలవంతంగా నిశ్చితార్ధం కూడా జరిపించేసిందంట. అనంతరం... ఈ ఫోటోలు అన్నీ చూపించి, కేసు పెట్టి, అమెరికాకు తిరిగి వెళ్లకుండా చేస్తానని బెదిరించడం మొదలుపెట్టిందంట. ఇదే సమయంలో అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసిందని చెబుతున్నాడు సదరు యువకుడు.

ఈ పరిస్థితుల నడుమ ఎట్టకేలకు ఈ నెల 4న ఆ యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో.. పోలీసులు జెమీమాను అదుపులోకి తీసుకున్నారు.

కట్ చేస్తే... తాజాగా మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది.. ఇది పోలీసులకే జెమిమ మార్కు జలక్ ఇచ్చిన విషయంగా చెబుతున్నారు. ఈమె ఈ ఏడాది జనవరిలో వ్యాపారవేత్త ఎడ్ల ఐజాక్ ను హనీ ట్రాప్ చేసి, తిరిగి రేప్ కేసు పెట్టిందట. దీంతో పీఎం పాలెం పోలీసులు ఐజాక్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. అప్పటికి ఈమె వ్యవహారాలను గుర్తించలేకపోయినట్లున్నారు!

తీరా ఇప్పుడు ఆ విషయాలన్నీ తిరగతోడితే... నాడు ఐజక్ కూడా ఈమె హనీ ట్రాప్ బాదితుడే అని తేలిందని అంటున్నారు. దీంతో... అప్పటి నిందితుడే ఇప్పుడు బాధితుడిగా మారాడని చెబుతున్నారు. మరి ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులతో సాగుతున్న ఈ హనీ ట్రాప్ వ్యవహారం ఏ విధంగా కొలిక్కి వస్తాదనేది వేచి చూడాలి!