విశాఖ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం...''పార్టీ బ్యాచ'' కోసం గాలింపు?
విశాఖపట్నంంలోని ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
By: Tupaki Desk | 20 Nov 2023 5:26 AM GMTవిశాఖపట్నంంలోని ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో... అవి భారీగా వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు.
అవును... విశాఖలోని ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయాయని చెబుతున్నారు. అయితే... బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకుని ఉన్నారేమో అని కార్మికులు తొలుత అనుమానించినప్పటికీ... ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క బోట్ల యజమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ప్రమాదం వల్ల సుమారు రూ. 30 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఈ ప్రమాదం వల్ల సుమారు 3000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెబుతున్నారు.
ఇక ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద స్థలంలో సీసీ కెమెరాల ద్వారా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఘటనా స్థలంలోని వివరాలను పోలీసు కమిషనర్ రవిశంకర్ అడిగి తెలుసుకున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
పార్టీ బ్యాచ్ కోసం గాలింపు?
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది. ఈ భారీ అగ్ని ప్రమాద ఘటన సమయంలో అక్కడ ఒక పార్టీ జరిగినట్లు చెబుతున్నారు. దీంతో, సదరు పార్టీ ఎవరు జరుపుకున్నారు.. ఆ సందర్భంగా గలాటా ఏమి జరిగింది.. ఆ గొడవలోనే కావాలని నిప్పుపెట్టారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. మద్యం మత్తులో గొడవ జరిగినట్టు గుర్తించారని.. దీంతో, పరారీలో ఉన్న పార్టీ బ్యాచ్ కోసం గాలిస్తున్నారని సమాచారం.