Begin typing your search above and press return to search.

విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్‌ కోసం గాలింపు?

దీంతో మొత్తంగా ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగడంతో బాధిత కుటుంబసభ్యులు బోరున విలపించారు

By:  Tupaki Desk   |   20 Nov 2023 8:53 AM GMT
విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్‌ కోసం గాలింపు?
X

విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌ లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి వేళ ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగగా... అక్కడనుంచి వరుసగా ఆ మంటలు పక్కనున్న బోట్లకు పాకాయి. దీంతో మొత్తంగా ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగడంతో బాధిత కుటుంబసభ్యులు బోరున విలపించారు.

అవును... విశాఖ ఫిషింగ్ హార్బర్‌ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. లక్షల విలువ చేసే మత్స్య సంపద, బోట్లు అగ్నికి ఆహుతవ్వడంతో వారంతా బోరున విలపిస్తున్నారు. సోమవారం ఉదయం వేలం వేసి విక్రయించాల్సిన మత్స్య సంపద ఆదివారం రాత్రి కాలి బూడిదవ్వడంతో వారి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది! ప్రమాదానికి గురైన ఒక్కో బోటులో సుమారు 5 నుంచి 6 లక్షల విలువైన చేపలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాలపై స్పందించిన పోలీసులు... రాత్రి 10:30 గంటలకు మంటలు చెలరేగాయని, గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ మంటలు పక్క బోట్లకు వ్యాపించి ఈ పెను ప్రమాదానికి దారితీశాయని అంటున్నారు. పైగా ఆ సమయంలో బోట్లలో గ్యాస్ సిలిండర్లు, డీజిల్‌ కేన్ లూ ఉండటంతో మంటల మరింతగా వ్యాపించాయని పోలీసులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని అన్నారు!

యూట్యూబర్ కోసం గాలింపు!:

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ లో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాద ఘటన సందర్బంగా ఓ యూట్యూబర్‌ అక్కడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు! దీంతో, సదరు యూట్యూబర్‌ పై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు తెలిసింది. రాత్రి ఫిషింగ్‌ హార్బర్‌ లో ఆ యూట్యూబర్‌ పార్టీ ఏర్పాటు చేశాడని.. ఆ పార్టీలో పాల్గొన్నవారి మధ్య మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారని చెబుతున్నారు. దీంతో, పరారీలో ఉన్న యూట్యూబర్‌ కోసం గాలిస్తున్నారని సమాచారం.

సీఎం జగన్‌ దిగ్భ్రాంతి:

విశాఖ హార్బర్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మత్స్యకారుల బోట్ల దగ్ధంపై ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. ఇదే సమయంలో... ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించాలని మంత్రి సీదిరికి సీఎం సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని తెలిపారు. అనంతరం... ప్రమాదం వెనుక ఎవరున్నా వదిలిపెట్టవద్దంటూ సీఎం వైఎస్ జగన్‌.. అధికారులను ఆదేశించారు.