Begin typing your search above and press return to search.

దేశంలోనే అతి పెద్ద ఇనార్బిట్ మాల్ విశాఖలో... ప్రత్యేకతలివే!

విశాఖపట్నం కైలాసపురంలో నిర్మిస్తున్న ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు సీఎం జగన్‌

By:  Tupaki Desk   |   1 Aug 2023 11:31 AM GMT
దేశంలోనే అతి పెద్ద ఇనార్బిట్ మాల్ విశాఖలో... ప్రత్యేకతలివే!
X

విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ఇనార్బిట్‌ మాల్‌ తొలి దశ పనులకు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జగన్ కీలక విషయాలు వెళ్లడించారు. ఈ మాల్ ప్రత్యేకతలను ప్రత్యేకంగా వివరించారు.. దీనివల్ల ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లభించే ఉపాధి అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి!

అవును... విశాఖపట్నం కైలాసపురంలో నిర్మిస్తున్న ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు సీఎం జగన్‌. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహేజా గ్రూప్స్‌ ఇనార్బిట్‌ మాల్‌ వల్ల సుమారు 8,000 మందికి ఉపాధి లభించనుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న ఇనార్బిట్ మాల్ కంటే విశాఖ మాల్ పెద్దదని తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగన్... విశాఖ అభివృద్ధికి మరింత దోహదం చేస్తూ... విశాఖపట్టణంలో ఆణిముత్యంగా నిల్చిపోయే మంచి ప్రాజెక్టుకు శంకుస్ధాపనతో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం విశాఖలో మొదలైందని అన్నారు.

ఇదే సమయంలో.. ఇదే రహేజా గ్రూపు హైదరాబాద్‌ లో ఇనార్బిట్‌ మాల్‌ ను 7–8 ఎకరాల్లోనే కడితే.. విశాఖలో 12–13 ఎకరాల విస్తీర్ణంతో పెద్ద మాల్‌ కు ఇక్కడ శంకుస్ధాపన చేసుకున్నామని తెలిపారు. 12 నుంచి 13 ఎకరాల్లో మాల్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత.... మిగిలిన భూమిలో రాబోయే రోజుల్లో రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ రెండున్నర లక్షల ఎస్‌.ఎప్‌.టీ.తో ఐటీ స్పేస్‌ కూడా రాబోతుందని అన్నారు.

ఈ సందర్భంగా... "ఈ రోజు మీ అందరి ద్వారా రహేజా గ్రూపు అధ్యక్షుడు నీల్‌ కు చెప్తున్నాను.. మేము మీకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటాం.. కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలోనే మీకు అందుబాటులో ఉంటాం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని... పెట్టుబడులు పెట్టండి" అని రహేజా గ్రూపు చీఫ్ కు జగన్ భరోసా ఇచ్చారు!

విశాఖ ఇనార్బిట్ మాల్ ప్రత్యేకతలివే:

17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో కె.రహేజా గ్రూపు మాల్ ను అభివృద్ధి చేయనుంది.

దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌ గా ఈ విశాఖ మాల్ మారనుంది.

సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం కానుంది.

250కి పైగా అంతర్జాతీయ బ్రాండ్లకు వేదికగా ఈ మాల్ మారనుంది.

ఈ మాల్‌ ద్వారా 8,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

రెండో దశలో 3,000 మంది పనిచేసే విధంగా సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ క్యాంపస్‌ ను అభివృద్ధి చేయనున్నారు.

మూడో దశలో ఫోర్‌ స్టార్‌ లేదా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ను 200 గదులు, బాంకెట్‌ హాళ్లతో నిర్మిస్తారు.

ఈ మాల్ ను 2026 నాటికి దీన్ని అందుబాటులోకి తేవాలని రహేజా గ్రూపు నిర్దేశించుకుంది.