విశాఖ రూపురేఖలు మార్చే లైట్ మెట్రో ప్లాన్ ఇదే
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కేంద్రానికి అప్పగించే కార్యక్రమం కోసం కసరత్తు చేస్తుతున్నారు.
By: Tupaki Desk | 13 Jan 2024 5:24 AM GMTఏళ్లకు ఏళ్లుగా విశాఖ వాసులు ఆశగా ఎదురుచూస్తున్న మెట్రో రైల్ కు సంబంధించి జగన్ సర్కారు తుది నిర్ణయం తీసుకోవటంతో పాటు.. రాష్ట్ర కేబినెట్ తాజాగా పచ్చజెండా ఊపేస్తూ నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. విశాఖ వ్యాప్తంగా 76 కి.మీ. మేర నాలుగు కారిడార్లలో నిర్మించే లైట్ మెట్రోకు సంబంధించిన ప్రాజెక్టు లెక్కలు ఫైనల్ అయినట్లుగా చెబుతున్నారు. తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కేంద్రానికి అప్పగించే కార్యక్రమం కోసం కసరత్తు చేస్తుతున్నారు. అందుకు అవసరమైన వివరాల్ని రెఢీ చేశారు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు. మొత్తం 54 స్టేషన్లతో 76.90కి.మీ. దూరాన్ని ఈ ప్రాజెక్టును కవర్ చేసే వీలుంది. పనులు ప్రారంభించిన మూడేళ్లలో తొలి రైలు తిరిగేలా డీపీఆర్ ను సిద్ధం చేవారు. మొత్తం ప్రాజెక్టు పూర్తి కావటానికి 8 ఏళ్లు పడుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు రూ.14,309 కోట్లు కాగా.. ఫేస్ 1లో కారిడార్ 1,2,3 పూర్తి చేసేందుకు రూ.9699కోట్లు.. ఫేజ్ 2లో కారిడార్ 4 నిర్మాణానికి రూ.4610 కోట్ల అంచనా వ్యయం వేశారు.
కారిడార్ 1లో స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.40 కి.మీ. దూరాన్ని కవర్ చేస్తారు. కారిడార్ 1లో మొత్తం 29 స్టేషన్లు ఉండనున్నాయి. కారిడార్ 2లో గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.08 కి.మీ. దూరానికి ఆరు స్టేషన్లను సిద్ధం చేస్తారు. కారిడార్ 3లో తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కి.మీ. దూరాన్ని కవర్ చేస్తారు. ఈ కారిడార్ లో మొత్తం 7 స్టేషన్లు ఉండనున్నాయి. ఇక.. నాలుగో కారిడార్ విషయానికి వస్తే కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు మెట్రోను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్లాన్ గా చెప్పాలి. ఈ కారిడార్ పొడవు 30.67 కి.మీ. కాగా.. ఇందులో పన్నెండు స్టేషన్లు ఉండనున్నాయి.
పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్యం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో విశాఖ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు. 30 ఏళ్ల పాటు మెట్రో ప్రాజెక్టును సొంతం చేసుకునే నిర్మాణ సంస్థకు ఆపరేషన్ అండ్ మొయింటెనెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకుంటుందని చెబుతున్నారు. కేంద్రానికి పంపనున్న డీపీఆర్ విషయంలో మోడీ సర్కారు వడివడిగా నిర్ణయం తీసుకుంటుందన్న అంచనా వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.