విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికలు...వైసీపీ సీటుకు కూటమి ఎసరు ?
విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ సీటుకు ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని నోటిఫికేషన్ జారీ చేసింది.
By: Tupaki Desk | 31 July 2024 3:56 AM GMTవిశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ సీటుకు ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక సంస్థల కోటాలో ఈ సీటుని భర్తీ చేయకున్నారు. ఆగస్ట్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చూస్తే ఆగస్ట్ 6న ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
ఆ రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి గడువు ఆగస్ట్ 13వ తేదీగా నిర్ణయించారు. ఆగస్ట్ 14న స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల విత్ డ్రాకు 16న అవకాశం ఇచ్చారు. ఇక రంగంలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఆగస్ట్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇక ఓట్ల లెక్కింపు సెప్టెంబర్ 3న చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనున్న నేపధ్యంలో మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 6 వరకూ ఈ కోడ్ అమలులో ఉంటుంది
మరో వైపు చూస్తే వైసీపీకి చెందిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ గత ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. ఆయన జనసేన నుంచి విశాఖ దక్షిణం ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. 2027 దాకా ఎమ్మెల్సీ పదవీ కాలం ఉంది. అంటే ఈ ఎన్నికల్లో నెగ్గిన ఎమ్మెల్సీ 2027 డిసెంబర్ దాకా పదవిలో ఉంటారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బలాబలాలు చూస్తే నూటికి ఎనభై శాతం పైగా వైసీపీకే బలం ఉంది.
స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక అంటే విశాఖలోని కార్పోరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. ఆ విధంగా చూస్తే వైసీపీకి బలం ఉంది కానీ ఇటీవల కాలంలో చాలా మంది కార్పోరేటర్లు కూటమి వైపు వెళ్లారు. గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా కూటమి వైపు మళ్ళుతున్నారు.
దాంతో కూటమి బలం పెరిగింది అని అంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఏ రకమైన వ్యూహం రూపొందించి తమదైన ఎమ్మెల్సీ స్థాన్ని ఎలా కాపాడుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. టీడీపీ కూటమి అయితే అధికారంలో ఉంది. బలంగా ఉంది. అంగ బలం అర్ధబలంతో ముందుకు వస్తున్న నేపధ్యం ఉంది.
ఈ ఎమ్మెల్సీ సీటు కోసం కూటమి నుంచి చాలా మంది రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక దశలో ఆసక్తిని చూపించారని ప్రచారం సాగింది. అయితే జీవీఎంసీ నుంచి పెద్ద ఎత్తున కార్పోరేటర్లు కూటమి బాట పట్టడంతో ఆయన తగ్గిపోయారు అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో టీడీపీ కూటమి నుంచి ఎవరు రంగంలోకి వస్తారో.